Article By Vanaja Che
Part I
Brief summary in English
Modi’s corrupt rule is being manipulated by the godi media as a great development. Such false narratives are innumerous. Hatred in the name of Hindutva is promoted as national unity, anarchy as great achievements. The person who prostrates before corporates as a Viswa Guru are only serving the interests of the few. Yet the circumstances are not favourable for BJP. It doesn’t have enough confidence to retain its power.
The heights of BJP’s corruption can be visible in the latest Electoral bonds scheme. This party got Rs 1000 crores bonds from 35 pharma companies allowing them to sell unnecessary, hazardous medicines, vaccines to the common public. Modi’s possible defeat indicates in the share market as many pro govt. companies shares fell when the electoral bonds list was out.
BJP’s own Internal survey predicts just 150- 170 seats for them. So its focus has been turned now on Southern States. Especially its strategies in Tamilnadu and Kerala are to be watched. BJP goes to any extent for power; and implements unscrupulous strategies right till the very last minute of elections.
ప్రస్తుతం మన దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలూ అవినీతి రంగులు పులుముకున్నవే. ఉన్నవాటిలో తక్కువ అవినీతితో కొద్దో గొప్పో జనానికి మేలుచేసే పార్టీని ఎన్నుకోవడం తప్ప ప్రజలకు మరో గత్యంత్రం లేని పరిస్థితి. అయితే ఇప్పుడు అధికారబలం, ఆర్థిక బలం మెండుగా ఉన్న బీజేపి అరాచకపాలనలో దేశంలో ఓటర్‌కి ఆ స్వేచ్ఛ కూడా లేకుండాపోతోంది. భారతీయ జనతా పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థనలను తన గుప్పెట్లో పెట్టుకుని ఒకవైపు తన అవినీతి పరాకాష్టకు, మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థుల అణచివేతకు వాటిని ఇష్టానుసారంగా వాడుకుంటోంది. గత పదేళ్లలో ముఖ్యంగా దేశంలో 80% పైగా ప్రసారమాధ్యమాలను ( మీడియా) తన ఆధీనంలోకి తీసుకున్న బీజేపి అవాస్తవాలు యధేచ్ఛగా వ్యాపింపజేసి ప్రజల్ని తప్పుదారిపట్టించడంలో చాలావరకు సక్సెస్ అయ్యింది. అధికారాన్ని నిలబెట్టుకోడానికి, తిరిగి అధికారం కొనసాగించడానికి బీజేపి ఏ పనైనా చేస్తుంది, ఎంతకైనా దిగజారుతుందనడానికి గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే సాక్ష్యాలు. మోడీ అవినీతి పాలనను అభివృద్ధిగా, హిందుత్వ పేరిట మతవిద్వేషాలు, అరాచకరాలను మహత్తర కార్యాలుగా, కార్పోరేట్లకు ఊడిగం చేసే వాడిని విశ్వగురుగా చిత్రించి అబద్ధాల కథనాలతో గోడీ మీడియా మోడీ మానియాని ప్రజల బుర్రల్లోకి చొప్పించినా రాబోయే ఎన్నికల్లో బీజేపి అధికారం నిలబెట్టుకుంటుందన్న నమ్మకం లేదు.
బీజేపీకి 370 , ఎన్‌డిఎ కూటమికి 400 పైగా సీట్లు వస్తాయని మోడీ బీరాలు పలికినా బీజేపీ నిర్వహించిన సొంత సర్వేలో ఈసారి ఆ పార్టీకి 150 -170 సీట్లకు మించి రావని తేలడంతో మోడీ కన్ను దక్షిణాధి రాష్ట్రాల మీద పడింది. మతాల మధ్య విధ్వేషాలు సృష్టించి మతరాజకీయాలతో, మీడియా అబద్ధాలతో అవినీతి సొమ్ముతో మళ్ళీ అధికారాన్ని చేజిక్కుంచుకోవాలనుకున్న కమలం పార్టీకి పరిస్థితులు ఏమంత సానుకూలంగా లేవు. అయితే ఆర్ ఎస్ ఎస్ , బీజేపీని తక్కువ అంచనా వేయలేము ఎంతటి ప్రతికూల పరిస్థితినైనా కుట్రలు, కుంతత్రాలతో తిమ్మిని బమ్మిని చేయగల చాణక్యం, చావు తెలివితేటలు వారికి మెండుగా ఉన్నాయని గతంలో అది అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తీరుని చూస్తే ఇట్టే చెప్పొచ్చు. ఈసారి కూడా అధికార దాహాన్ని తీర్చుకోవడం కోసం చివరి నిముషం వరకు ఎన్ని పన్నాగాలు పన్నాలో అన్నీ పన్నుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బీజేపీకి ఓటమి భయం
బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈసారి పాకిస్థాన్, చైనా ఊసు లేకుండా అయోధ్య రామాలయ నిర్మాణం, ద్వారక, మధుర కృష్ణ లీలలు ఈ ఎన్నికలను నల్లేరు మీద నడక చేస్తాయనుకున్న బీజేపీకి పాపం రామకృష్ణుల ఆశీస్సులు దక్కలేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా అనుకూల పవనాలు కనిపించకపోవడం , సొంత సర్వే ఫలితాలు అంచనాలను తారుమారు చేయడంతో బీజేపీ అలర్ట్ అయ్యింది. గెలుపు కుతంత్రాలతో రంగంలోకి దిగింది.
త్రికోణ వ్యూహం ః బీజేపీలోని ముగ్గురు పెద్దలూ మూడు బాధ్యతలు.
- బలంగాఉన్న ప్రాంతీయ పార్టీలల్లో చీలిక తీసుకొచ్చి, నాయకత్వాన్ని నిర్వీర్యం చేయడం అమిత్‌షా డ్యూటీ ఇది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపిని చీల్చి చేసిన షిండే తరహా కుట్ర రాజకీయాలు తర్వాత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేష్, బీహార్ , కర్నాటకలో అవలంభించి అక్రమమార్గంలో అధికారం (బెంగాల్ మినహా ) అందిపుచ్చుకున్నారు. ఇదే పని చేయబోయి తెలంగాణలో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు అదే… ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి కనీసం రెండవ స్థానంలో దూరే ప్రయత్నం.
- మతవిద్వేషాలు రెచ్చగొట్టి మత రాజకీయాలు చేయడం, ముస్లింలలో కూడా పాస్మంద ముస్లింలను తమ వైపు తిప్పుకునేందుకు ముస్లం కమ్యూనిటీలో వారి మధ్యే విద్వేషం రగిలించడం , వారసత్వం కుటుంబపాలన అంటూ ప్రత్యర్థుల మీద దాడి, అవినీతి ఆరోపణలతో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేయడం మోడీ డ్యూటీ. దీనికి అమిత్‌షా , నడ్డా ఆర్ ఎస్ ఎస్ వంతపాడడం.
- 2019లోఎన్‌డిఎతోఉండి విడిపోయిన మిత్ర పక్షాలను నయానో, భయానో (వింటే సరి, వినకపోతే ED, IT, CBI లు జేబులో రెడీగా ఉన్నాయి ) ఏకం చేసి ఘర్ వాపస్ అంటూ మళ్ళీ తమ గూటికి చేర్చుకునే డ్యూటీ ఆర్ ఎస్ ఎస్ , నడ్డా పైన.
బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి?
ఈ దేశానికి బీజేపీ చేసిందేంటి?
వేల కోట్లతో రాముడి గుడి, వేల కోట్లతో పటేల్ విగ్రహం, పేర్లు మార్చడం, వందేభారత్ బీజేపీ చేసింది ఇంతే. వీటివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఇక మతం మత్తు తలకెక్కిన వారికి గొప్పగా కనిపించే ఆర్టికల్ 370, CAA, ట్రిపుల్ తలాక్, యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటి అనైతిక చర్యలు లౌకిక భారత అస్థిత్వానికే ప్రమాదం.
ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు లేదు, విద్య, వైద్య రంగాల్ని మెరుగుపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. 2014 ఎన్నికల ముందు పదివేల కోట్లు ఖర్చు పెట్టి అబద్దాలు మాయలు మ్యాజిక్కులతో మోడీని అధికార పీఠం ఎక్కించిన అంబానీ , అదానీకి పవర్ లోకి వచ్చిన వెంటనే ఆయిల్ కంపెనీలు, సీపోర్ట్ లు, ఎయిర్‌పోర్టులు విద్యుత్ ప్రాజెక్టులు, రైల్వేలు , రోడ్లు టోల్ గేట్లతో సహా అనేక ప్రభుత్వ సంస్థలు , కట్టబెట్టి మోడీ తన కృతజ్ఞత చాటుకున్నాడు. ఆఖరికి పోర్టులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే ధనార్జనే ధ్యేయంగా స్మగ్లింగ్ , మాధకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అనైతిక చర్యలకు దేశం తలుపులు తెరిచినట్టే.
నోట్ల రద్దుతో దేశాన్ని అల్లకల్లోలం చేశారు. కరోనా సమయంలో ప్రజల్ని గాలికొదిలేశారు. కార్మిక చట్టాలు, రైతు చట్టాలతో రైతులను సామాన్యలను అష్టకష్టాలు పెట్టారు. ఆర్థిక వ్యవస్థ కుంటుబడింది. జిడిపి ఘోరంగా పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు అందనంత ఎత్తుకి ఎదుగుతూ సామాన్యుడి బతుకు భారమైంది. గత పదేళ్ళలో దేశంలో నిరుద్యోగ సమస్య 35.2% నుంచి 65.7%కి పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లో 62 ప్యూన్ పోస్టుల కోసం 3,700 పిహెచ్‌డిలు, 28.000 పోస్టుగ్రాడ్యుయేట్లు, 50000 గ్రాడ్యుయేట్లు ధరఖాస్తు చేసుకున్నారని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇదే మోడీ తీసుకొచ్చిన అచ్ఛే దిన్.
దొంగలకు మోడీ అండ
దేశం అప్పుల మయం అయిపోయింది. బీజేపీ హయాంలో కోటిన్నర కోట్ల అప్పు పెరిగిపోయింది. కోటిన్నర కోట్ల అప్పు ఇన్ని కోట్లు ఏం చేశారు? ఏ అభివృద్ధికి ఖర్చు చేశారు? రైతు వ్యతిరేక చట్టాన్ని నిరసిస్తూ రైతులు ధర్నా చేస్తే వేకులు దిగ్గొట్టిన ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు 13 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. విజయ్‌మాల్యా, నీరవ్‌మోడీ మొదలైన బడా బడా దొంగలు బ్యాంకుల్ని కొల్లగొట్టి ప్రజల సొమ్ము నిలువునా దోచుకుంటే, వాళ్ళు దేశం నుండి పారిపోకుండా వాళ్ళ పాస్‌పోర్టులు సీజ్ చేయమని సుప్రీం కోర్టు ఆర్డడ్ ఇస్తే దాన్ని బేఖాతర్ చేస్తూ మోడీ ఆ దొంగల్ని ధర్జాగా విదేశాలకు సాగనంపాడు. ఇలా చెప్పుకుంటూపోతే బీజేపీ అరాచకాలకు అంతులేదు.
న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశారు, గవర్నర్ వ్యవస్థతో రాజకీయాలు నడుపుతూ , సిబిఐ, ఐటి, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చేసి తమని ప్రశ్నించే ప్రత్యర్థుల్ని , ప్రజా నాయకుల్ని దాడులు, కేసులతో వేధించి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో బీజేపీది అందెవేసిన చేయి. యూపిఎ ప్రభుత్వంలో 112 ఈడి కేసులు నమోదైతే బీజేపీ హయాంలో అవి 3000 పైగా ఉన్నాయి. వీటిలో 98% విపక్షాలను ఆరోపిస్తూ నమోదైనవే. అందులో కోర్ట్ ముందు పటిష్టమైన సాక్షాధారాలతో నిలబడగలిగేవి 0.5% మాత్రమే.
ఎలెక్టోరల్ బాండ్లు, బీజేపీ అవినీతి
ఇవన్నీ ఒక ఎతైతే, తాజాగా సుప్రీం కోర్టు చొరవతో వెలుగుచూసిన ఎలక్టోరల్ స్కామ్ ఒక ఎత్తు. బీజేపీ అవినీతి ఏ స్థాయిలో ఉందో ఇది బట్టబయలు చేసింది. వివిధ కంపెనీలు వేల కోట్ల రూపాయలు బీజేపీకి కట్టబెడితే బదులుగా మోడీ వారికి లక్షల కోట్ల లాభాలు చేకూర్చే అవకాశాలు కల్పించాడు. కార్పోరేట్లు రాజకీయ నాయకులు ఆడిన ఈ ఎలక్టోరల్ బాండ్ల వ్యాపార క్రీడలో సామాన్యులు బలిపశువులయ్యారు. 35 ఫర్మా కంపెనీల నుండి బీజేపీకి వెయ్యికోట్లు బాండ్ల రూపంలో అందాయి. నాసిరకం మందులు అధిక ధరలకు అమ్ముకునే, అవసరం లేకపోయినా అడ్డమైన మందులు ప్రజల నెత్తి మీద రుద్దే అవకాశం బీజేపీ ఆ కంపెనీలకు కల్పించింది.
సీరం ఇన్స్టిట్యూట్‌కి టీకాల రూపంలో దేశ ప్రజల ప్రాణాలనే బలిపెట్టింది. ఈ అవినీతి బురద ప్రజలకు కనిపించకుండా ప్రజల దృష్టి మరల్చడానికి హడావిడిగా బిఆర్ ఎస్ లీడర్ కవితను, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ దాడితో అవినీతి అంటూ అరెస్టు చేసింది. ఇదే లిక్కర్ కేసులో నిందితుడిగా అరెస్టై జైలుకెళ్లిన వారి నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ముడుపులు అందడం బీజేపీ నిజాయితీకి గొప్ప నిదర్శనం. మైనింగ్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడంటూ పలు కేసులు ఎదుర్కొంటున్న గాలిజనార్ధనరెడ్డిని తాజాగా బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది. తమకు ఫండ్ ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీల మీద పార్టీల మీద ఈడీ ఐటి దాడులు చేయడం వెంటనే వాళ్ళు బీజేపీ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడం ఎస్‌బిఐ విడుదల చేసిన లిస్ట్ చూస్తే అర్థమవుతుంది.
రేప్పొద్దున అధికారం కోసం రాజకీయ మార్కెట్లో ఎంపీలను కొనుగోలు చేయాలంటే బోలెడు డబ్బు కావాలి కదా. బీజేపీ ఇప్పుడు ఓటమి బెంగతో ఎన్‌డీఎలో చేరమని, బీజేపీలో విలీనం చేయమని కొన్నిప్రాంతీయ పార్టీల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. నిరాకరిస్తే ఈడీ కేసులు , అవినీతి ఆరోపణలు బెదిరింపులు జైళ్ళు. వాళ్ళు బీజేపీలో చేరిపోగానే వెంటనే వాళ్ళ అవినీతి అంతా మటుమాయమౌతుంది. కేసులు గాల్లో కలిసిపోతాయి. వాళ్ళు ఉత్తములైపోతారు. ఇంత నిస్సిగ్గు రాజకీయాలు బహుశా ప్రపంచంలో ఎక్కడా చూడలేమేమో. గతంలో రాజకీయ నాయకులు అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గపు పనులన్నీ చాటుమాటుగా రహస్యంగా చేసేవాళ్ళు బీజేపీ వచ్చాక ఏమాత్రం సంకోచం లేకుండా అంతా బహిరంగంగానే లెక్కలేనన్ని నీచమైన పనలు చేస్తున్న నాయకులను చూస్తున్నాం. ఎన్ని ఘోరాలైనా మత విద్వేషాల్లో కొట్టుకుపోతాయని, భజన మీడియా , ఐటి సెల్ అబద్ధపు కథనాలతో బురద కడిగి ఆకాశానికి ఎత్తేస్తాయని వీరి ధీమా!
బీజేపీ ఓటమి షేర్ మార్కెట్ కి తెలుసు
ఇప్పుడు అంచనా తారుమారైంది. అయినా 400 సీట్లని ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అనుకూల మీడియా (80% వీరిదే) అబద్ధపు సర్వేలతో మోడీకి మళ్ళీ పట్టం కడుతూ ప్రజలతో మైండ్ గేమ్ అడుతోంది. ప్రజలకు నిజాలు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. హైప్ సృష్టించి ఓట్లు రాబట్టాలని చూస్తున్నారు. సర్వేలు వదిలేద్ధాం షేర్ మార్కెట్ ని జాగ్రత్తగా గమనిస్తే మోడీ ఓడిపోతున్నాడన్న విషయం అర్థమవుతుంది. ఎస్ బిఐ ఎలక్టోరల్ బాండ్స్ జాబితా విడుదల చేయగానే షేర్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. అదానీ షేర్లు ఘననీయంగా పడిపోయాయి. బీజేపీకి , మోడీకి సన్నిహితంగా ఉన్న వారి అన్ని కంపెనీ షేర్లు రికార్డుస్థాయిలో పడిపోయాయి. జియో 7% పడిపోయింది. మోడీ ఓటమి షేర్ మార్కెట్ కి అర్థమైపోయింది.
ఎలక్టోరల్ బాండ్ల లిస్ట్ విడుదలైన రోజే సుప్రీం కోర్టులో ఇంకో పిటిషన్ కూడా వేశారు. సాధారణంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి , ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ ముగ్గురి ఆధ్వర్యంలో ఎన్నికల కమీషనర్స్ నియామకం జరుగుతుంది. ముగ్గురిలో ఇద్దరు ఆమోదిస్తే (మూడింట రెండు ) వారిని ఎన్నికల కమీనర్లుగా ఎంపిక చేస్తారు. అయితే ఈసారి చీఫ్ జస్టిస్ ఉండకూడదని ఆ స్థానంలో బీజేపీ మంత్రినే తీసుకోవాలని ప్రతిపాదన చేశారు. అంటే బీజేపీ ఎన్నికలు నిజాయితీగా జరగకుండా చేసే ప్రయత్నం చేస్తోంది. తమకు అనుకూలంగా ఉండే వారినే ఎలక్షన్స్ కమిషనర్లు గా ఎన్నుకోవాలనే ఎత్తుగడ. ఇటీవల కాలంలో సుప్రీం కోర్టు కొన్ని విషయాల్లో బీజేపీ విధానాలను ప్రశ్నిస్తోంది. అందుకే సిజెని తప్పించే ప్రయత్నం. ఇంతటి దారుణానికి దిగడంలో కూడా ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
విపక్షాల బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్
ఓటమి భయంతో బీజేపీ ఎంతకు దిగజారిందంటే అవినీతి సొమ్ముగా ముద్రవేసి విపక్షాల బ్యాంక్ అకౌంట్లన్నీ బీజేపీ ఫ్రీజ్ చేసి ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. బాండ్ల రూపంలో వసూలైన మొత్తం సొమ్ములో 50% బీజేపీదే అయినా అది అవినీతి కాదు. దాన్ని వీళ్ళు యధేచ్ఛగా వాడుకోవచ్చు కానీ విపక్షాలు ముట్టుకుంటే మాత్రం పాపు సొమ్ము. వీళ్ళు రెండు చేతుల్లో పదేసి ఆయుధాలు పట్టుకుని విపక్షాలను పూర్తిగా నిరాయుధుల్ని చేసి ఎన్నికల యుద్ధానికి సిద్ధం కమ్మంటున్నారు. పైగా ఎలక్టోరల్ బాండ్ల రోపంలో ఆయా పార్టీలకు అందిన సొమ్ము మొత్తం పీఎం ఫండ్‌కి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. కరోనా సమయంలో పీఎం కేర్ కింద సేకరించిన వేల కోట్లకు రెక్కలొచ్చి ఎక్కడికి ఎగిరిపోయాయో ఎవరికీ తెలియదు. ఆ లెక్కలు చెప్పమని విపక్షాలు ఎంత పట్టుబట్టినా బీజేపీ నోరుమెదపలేదు.
EVM మిషిన్ల అవకతవకలు,
గెలుపు మీద ప్రభావం
ఇక అన్నిటికంటే ముఖ్యం EVM, VVపాట్ మిషిన్లు. EVM మిషిన్లలో ఫలితాలు తారుమారు చేసే అవకాశం ఉందని చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవియంలకు నిరసనగా ఢిల్లీ , మహారాష్ట్రల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది కానీ, కాంగ్రెస్ కార్యక్రమాలను , రాహుల్ గాంధీ సభలకు జనం నుంచి వస్తున్న స్పంధన లాంటి ఏ విషయాలనూ ప్రధాన మీడియా ప్రసారం చేయదు.
EVMలలో ఫలితాలు మార్చే అవకాశం ఉండదని ఎన్నికల కమిషన్ చెబుతూ వస్తొంది కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఆ మిషిన్లను ECIL, BEL కంపెనీలు సంయుక్తంగా అసెంబుల్ చేస్తాయి. ఈ సొసైటీ కంపెనీ నిపుణుల అంచనా ప్రకారం ఈ మిషిన్లలో అమర్చే మెమరీ చిప్‌ను చాలా తేలికగా 5 నిమిషాలలోపే మార్చే వీలుంది. పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేసే సాధారణ రేడియో రిసీవర్లు కూడా EVMలలోని ఎలక్ట్రోమాగ్నటిక్ సిగ్నల్స్‌ని గ్రహించగలుగుతున్నాయని తద్వారా ప్రతీ ఒక్కరు ఎవరికి ఓటు వేస్తున్నారన్న విషయం ఇట్టే తెలిసిపోతుందన్న విషయాన్ని కూడా నిపుణులు గుర్తించారు.
అసలు EVMలకు ఉపయోగించే మైక్రోచిప్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఈ విషయాలు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటి? EVMలలో ఉపయోగించే మైక్రోచిప్ అమెరికాకు చెందిన ప్రఖ్యాత కంపెనీ NXP సరఫరా చేస్తుందని BEL RTI (రైట్ టు ఇన్ఫర్మేషన్)కి చెప్పింది.
EVMలలో ప్రోగ్రామింగ్ అనేది ఒకే ఒక్కసారి మాత్రమే సాధ్యపడుతుందని ఎన్నికల కమీషన్ పదేపదే చెబుతోంది. కానీ, NXP అఫీషిల్ వెబ్‌సైట్‌లో EVMలలోని మైక్రోచిప్‌ని బయటికి తీసి ఎన్ని సార్లైనా రీప్రోగ్రామింగ్ చేయొచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. మైక్రోచిప్‌లో పొందుపరిచిన సీక్రెట్ కోడ్ బహిర్గతం చేయడానికి ఎన్నికల కమీషన్ ఎందుకు నిరాకరిస్తోంది? ఎందుకు బయపడుతోంది.? పారదర్శకంగా, బాహాటకంగా నిపుణుల సమక్షంలో పరీక్షించి విపక్షాల అనుమానాలు నివృత్తి చేసి లోపాలుంటే సవరించి మరింత కట్టుదిట్టమైన భద్రతకు ఆస్కారం కల్పించవచ్చు కదా అనేదే ప్రశ్న.
ఇంటర్నేషనల్ పౌండేష్ ఫర్ ఎలక్టోరల్ సిస్టం, అమెరికాకు చెందిన నేషనల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూట్ కలిసి EVMల మీద నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిన విషయమేమంటే బయటివాళ్ళు ఎవరైనా సరే EVMలలో అమర్చిన సోర్స్ కోడ్‌లలో తప్పులను సరిచేసే వీలుంటుంది. అంటే అందులో ఉన్నదాన్ని తీసేసి మనకు కావలసిన దాన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విషయాన్నే అమెరికా ప్రభుత్వం సోర్స్ కోడ్ ఆఫ్ EVM పేరిట ఆన్‌లైన్‌లో ప్రచురించింది. ఇన్ని అవకతవకలు ఉన్నాయి కాబట్టే చాలా దేశాలు ఎన్నికలకు EVMలను బ్యాన్ చేశాయి.
మరి మన దేశంలో ఎన్నికల కమిషన్ ఎందుకు వీటిని వదలదు? కనీసం సోర్స్ కోడ్ చెప్పడానికి కూడా ఎందుకు భయపడుతోంది?
మన ఎన్నికలు ఎందుకింత గందరగోళంగా ఏమాత్రం పారదర్శకత లేకుండా ఏకపక్షంగా ఉన్నాయి? ఇదేం ప్రజాస్వామ్యం? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికే దిక్కులేదు సామాన్యుల మాటకు ఏం విలువ ఉంటుంది?!! ఇదంతా చూస్తుంటే, EVMల వల్లే మోడీ గెలుస్తున్నాడు, EVMలు లేకపోతే మోడీ గెలవలేడు అన్న రాహుల్ గాంధీ మాటలు కొట్టిపారేయలేము.
Part II
BJP fears Defeat in General Elections
Brief Summary in English
The BJP would get 370 seats and its alliance NDA would get 400+ seats in the forthcoming elections’ is the reverberating ongoing propaganda of the pro BJP media. But the actual conditions in the various parts of the nation are different.
BJP won 303 MP seats in 2019 and retaining the same number of seats now is doubtful. The Ayodhya Ram mandir impact is lesser, with the. Akhilesh, Congress combination in UP, Opposition CMs arrests in Delhi and Jharkhand, the Haryana farmers agitation etc are prominent hurdles for the BJP. So It may lose around 50 seats in these states.
In the northeast states BJP won 14 seats in 2019. The partisan ruling and callousness and inaction of the BJP govt. in Manipur definitely works against the party. Eventually considerable seats would be lost.
To see Overall picture, BJP perhaps is losing around 100 seats against its 303 seats in 2019. So to get the magic figure of 272 seats to retain its power BJP has no option other than to focus on Southern India.
So the BJP is speeding up to implement its strategies to win as many seats as possible. But crucially, the question is. Can the communal party BJP get considerable seats in the south? There are distinct variations between North India and South India. In terms of culture, customs, habits, languages, societal impacts, people’s thinking patterns, etc. The people of the southern states are influenced by many social reformers, rational thinkers. The aggressive agitations of Communists, Naxalites and Dravidian movements etc which all have a deep impact here in the peoples. Thinking and reflected in their art, literature and lifestyle.
Pro BJP media repeatedly says that the NDA gets 400+ seats and it secures 85 seats in the South. But if it is true why does the party resort to unscrupulous activities like dividing the regional parties and threatening them using the ED to join in their alliance. Nardendra Modi’s desperate present countrywide whirlwind campaigns especially in the south clearly are in contrast with his 2019 comparatively confident campaigning style.
Tamilnadu: From 1967 onwards, people here elect the Periyar ideological rooted parties only i.e. either DMK or Anna DMK. They strongly oppose Hindi language domination. The BJP’s modus operandi – ‘communal polarisation politics’ won’t work out here. Even rhe AIADMK may get 2 or 3 seats whereas BJP probably does not win a single seat.
Kerala: Here main parties are Left and Congress. They both are part of the INDIA block. Although BJP is trying to propagate hate politics in the name of religion, all the 20 seats are won possibly by Left and Congress.
Karnataka: BJP won 25 MP seats out of 28 in this state. In 2019.The Independent MP Sumalatha, the movie actress joined the BJP later and now 26 MP seats are in the account of the BJP. People of Karnataka voted against BJP’s corrupt rule in the recent Assembly elections. The ruling Congress is so strong now under the leadership of Siddha Ramaiah and DK Shiva Kumar. So the BJP is likely to lose 10- 15 seats here.
Telangana: Same situation here too. The BJP may not retain its 4 sitting MP seats in the coming elections. Victory in Karnataka encouraged the confidence of Congress which came to power in the recent Assembly elections. It is now becoming stronger. In all the 17 MP seats. if the BJP wins 3 it is great enough.
Andhra Pradesh: Likely not a single MP seat goes to BJP here. Herethere is no importance to National parties like BJP and Congress. They don’t have even a single digit vote share. Telugu Desam and Janasena, The BJP jointly contesting as NDA but no unity and no proper coordination is visible. The CM Jagan mohan reddy’s party YSRCP is contesting separately and implementation of welfare schemes for the poor is his main strength. This party can get 20 MP seats out of total 25.
If the general elections in the country are conducted transparently the BJP will not form the Govt. for the third time. But the big crony capitalists like Adani and Ambani much need this regime and conspiracies follow. They use their financial power undoubtedly in favour of the BJP . The future of the country depends on whether the opposition parties will stand against these conspiracies and EVM manipulations.)
ఓటమి భయంతో ఒణికిపోతున్న బీజేపీ
దక్షిణ భారతదేశంలో బీజేపీ స్థితిగతులు
ఈసారి ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు, ఆ పార్టీ భాగంగా ఉన్న ఎన్‌డీఎ కూటమి 400 పైగా పార్లమెంటరీ సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి వస్తుందని బీజేపీ మీడియా తెగ ప్రచారం చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి.
2019 ఎన్నికల్లో బీజేపీ సాధించిన 303 సీట్లను పరిశీలిస్తే – అందులో 224 సీట్లు బీజేపీ చాలా బలంగా ఉన్నామని చెప్పుకునే ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసి గెలిచినవే. ఉత్తరప్రదేశ్ లో 80కి 62, గుజరాత్‌లో 26 కి 26, మధ్యప్రదేశ్‌లో 29కి 28, రాజస్థాన్‌లో 25కి 24, జార్ఖండ్‌లో 14కి 11, హర్యానాలో 10కి10, ఉత్తరాఖండ్ లో 5కి 5, ఢిల్లీ 7కి 7 సీట్లు. కాబట్టి ఇవి ఇంకా పెరిగే అవకాశం లేకపోగా ఈసారి ఈ స్థానాలన్నీ బీజేపీ ఖాతాలోనే పడతాయన్న నమ్మకం లేదు.
రామ మందిర ప్రభావం అంతగా లేకపోవడం , అఖిలేష్ యాదవ్ , కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఉత్తరప్రదేశ్ లో బీజీపికి కొంత నష్టం కలిగించనుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ల అరెస్టులు, హర్యానా రైతుల ఆందోళన ప్రభావం వంటి అనేక అంశాల కారణంగా గత ఎన్నికలతో పోల్చితే ఈసారి బీజేపీకి ఈ రాష్ట్రాల్లో సుమారు 50 సీట్లు తగ్గే అవకాశముంది.
ఇక 2019లో బీజేపీ మంచి మెజారిటీ సాధించిన రాష్ట్రాల విషయానికొస్తే…
బీహార్ లో నితీష్ కుమార్ మహాకూటమి నుంచి విడిపోయి మళ్ళీ ఎన్ డి ఏలో చేరడం వల్ల వ్యతిరేకత మూటగట్టుకోవడం, తేజస్వీయాదవ్, ఆర్ జేడీ హవా బీజేపీలో గుబులు పుట్టిస్తోంది.
మహారాష్ట్రలో శివసేన, ఎన్ సీపీ చీలిక , ఉద్దవ్ థాకరే తిరిగి పుంజుకోవడం బీజేపీ కూటమికి గట్టి దెబ్బ.
పశ్చిమ బెంగాల్ మమతా ప్రభావం బీజేపీని భయంతో దేశమంతా పరుగులు పెట్టిస్తోంది.
ఇక అన్నిటికంటే ముఖ్యం కర్నాటక. కర్నాటకలో 28 లోక్ సభ స్థానాలుంటే, 2019లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. అప్పటి పరిస్థితులు వేరు. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. 2019లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న కాంగ్రెస్‌కి ఈసారి 12-15దాకా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది బీజేపీకి కోలుకోలేని దెబ్బ.
ఇక ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 24 లోక్ సభ సీట్లలో 2019 ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాలు గెలుచుకుంది. ఇటీవల మణిపూర్ లో బీజేపీ వ్యవహరించిన తీరు, దాని ప్రభావం ఆ రాష్ట్రాల్లో ఈ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించనుంది ఫలితంగా అక్కడా బీజేపీ సీట్లకు గండి పడే అవకాశం.
మొత్తంగా చూస్తే గతంలో గెలిచిన 303 నంబర్‌లో ఈసారి బీజేపీ సుమారు వంద సీట్లు కోల్పోయే అవకాశముంది. ఇప్పడు మోడీ – అమిత్‌షాల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి రావాలంటే 543 స్థానాల్లో 272 స్థానాలు గెలిచితీరాలి. కొరతపడే ఆ స్థానాలు భర్తీ చేయాలంటే ఇప్పుడు బీజేపీకి దక్షిణ భారతదేశం తప్ప మరో దారి లేదు.
లక్షద్వీప్ , అండమాన్ (ఒక్కోస్థానం) తో కలిపి దక్షిణాదిన మొత్తం 132 పార్లమెంటరీ సీట్లున్నాయి. ఈ 132లో 2019లో బీజేపీ గెలుచుకున్న సీట్లు కేవలం 29. అందులో 25 ఒక్క కర్నాటక నుంచే. తెలంగాణలో 4 స్థానాలు దక్కించుకుంది. తమిళనాడు, ఏపీ, కేరళల్లో బీజేపీ స్థానం శూన్యం. ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్లో జరగబోయే నష్టాన్ని దక్షిణాదిన భర్తీ చేసుకుంటేనే అధికారం దక్కుతుంది.
అందుకే బీజేపీ దక్షిణాన తన వ్యూహాలను వేగవంతం చేసింది. సౌత్‌లో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలున్న పెద్ద రాష్ట్రం తమిళనాడు. 39 స్థానాలు, పుదుచ్చేరితో కలిపి 40. కేరళలో 20. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్ని వీలైతే అన్నితమ ఖాతాలో వేసుకునే పనిలో పడింది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలుంటే, తెలుగుదేశం, జనసేన ఎన్‌డీఏలోనే ఉన్నాయి కాబట్టి వైసీపీ అధినేత జగన్‌తో కూడా ఎన్నికల ప్రత్యర్థి అయినప్పటికీ ఏ పేచీ లేకుండా సామరస్యంగా , జాగ్రత్తగా వ్యవహారం నడిపిస్తే ఎన్నికల తర్వాత వైసీపీని ఎన్‌డీఏలో చేర్చుకోవచ్చనే ప్లాన్‌లో ఉంది బీజేపీకి. తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.
ఇక కర్నాటకలో 20 సీట్లకు తగ్గకుండా ఉండేలా వ్యూహరచన చేస్తోంది. మొత్తం మీద ప్రాంతీయ పార్టీల పొత్తు సాయంతో బీజేపీ దక్షిణ భారతదేశం నుంచి కనీసం 70 లోక్ సభ సీట్లు ఎన్‌డీఏలో పడేలా ఎత్తులు వేస్తోంది. అయితే ఇక్కడ బీజేపీ కల ఫలిస్తుందా?
దక్షిణాదిన ఒక మత తత్వపార్టీ అన్ని సీట్లు సాధించే అవకాశం ఉందా ?
ఉత్తర భారతదేశానికీ, దక్షిణ భారతదేశానికీ సంస్కృతీ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, భాష, సాంఘిక ప్రభావాలు, ప్రజల ఆలోచనా విధానాల్లో గణనీయమైన వ్యత్యాసముంది. కమ్యూనిస్టుల ప్రభావం, ప్రజా చైతన్య సాయుధ వర్గ పోరాటాలు, నక్సలైట్ ఉద్యమాలు , ద్రవిడ్ ఉద్యమం వంటి అనేక సాంఘిక సంస్కరణలతో,హేతుబద్ధమైన ఆలోచలనతో ఎందరో సంఘసంస్కర్తలు ఈ సమాజం మీద ప్రజల ఆలోచనల్లో చెరగని ముద్ర వేశారు. సామరస్యం, సమైక్యతా భావం, ఆత్మగౌరవంతో మిళితమైన సాహిత్యం.. కళలు, జీవన విధానం మీద వాటి ప్రభావం వంటి అనేక అంశాలు ఇక్కడి ప్రజల్ని ఉత్తరాది ప్రజలకు పూర్తి భిన్నంగా ఉంచుతాయి.
అజ్ఞానం, మూఢ విశ్వాసాలు, సాంఘిక దురాచారాల నుంచి ప్రజల్ని జాగృత పరిచే సంఘ సంస్కర్తలు ఉత్తర భారతదేశ చరిత్రలో మనకు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరు. బెంగాల్ , మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కూడా ప్రజా చైతన్య ఉద్యమాలు, సంస్కృతి, సంఘసంస్కరణలు అక్కడి ప్రజల్ని అంధవిశ్వాసాల నుంచి జాగృతం చేశాయి. కానీ ఉత్తరాది ప్రజలు మాత్రం ఉపాధి అవకాశాలు లేక.. అభివృద్ధికి నోచుకోక అజ్ఞానం, పేదరికం, నిరక్షరాస్యత, అధిక జనాభా వంటి అనేక విషయాల్లో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే బాగా వెనుకబడి ఉన్నారు. ఇలా పేదరికంలో మగ్గిపోయే నిస్సహాయ ప్రజలు మతానికీ, దేవుడికీ, అంధవిశ్వాసాలూ, దురాచారాలూ, దోపిడీలకూ చాలా తేలిగ్గా లొంగిపోతారు.
సంస్కరణ అనే మాటకు అర్థం కూడా తెలియని , కడుపునిండా తిండికి నోచుకోని పేద ప్రజల్లో మత విధ్వేషాలు రగిలించి మతాల మధ్య చిచ్చుపెట్టి మారణహోమం సృష్టించి వారిని అబద్ధాలతో తప్పుదారి పట్టించడం అంత కష్టమైన పని ఏమీ కాదు. ఏళ్ళ తరబడి ఆర్ ఎస్ ఎస్ , బీజేపీ చేస్తుంది ఇదే. అందులో వారు పూర్తిగా విజయవంతమై దేశాన్ని బ్రష్టుపట్టించి వంద సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళారు. అయితే మతం, దేవుడు, విధ్వేషాలు ఇవే ఊపిరిగా ప్రజల్ని ఎంతో కాలం మభ్యపెట్టలేవు. హిందుత్వ, జైశ్రీరామ్, జైహింద్, జైహిందీ ఇవి ఏవీ పేదవాడి కడుపు నింపలేవు. ఇవన్నీ అబద్ధాలే ఆకలి ఒక్కటే నిజం అనే నిజాన్ని ప్రజలకు ఆ ఆకలే ఏదో ఒకరోజు కచ్చితంగా చెబుతుంది. అతి మెల్లిగా అయినా నత్తనడకన అయినా ప్రజల్లో ఆకలి ప్రశ్నిస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, దేశం పూర్తిగా దోపిడీదారుల చేతుల్లోకి సునాయాసంగా వెళ్ళిపోతుంది.
మతం మత్తు సడలుతూ ‘మాకు కావలసింది రాముడు కాదు కడుపునిండా తిండి, ఉపాధి, చదువు ’ అనే ఆలోచన కాస్తోకూస్తో ఉత్తరాదిన ఇప్పుడిప్పుడే అవగతమవుతోందనడానికి అయోధ్య రామ మందిరం బీజేపీకి గెలుపు బాటలు వేయలేకపోవడమే నిదర్శనం. గత మేనిఫెస్టోల్లో బీజేపీ చేసిన హామీలు, సంక్షేమ పథకాలు, దేశం సాధిస్తున్న గొప్ప అభివృద్ధి మోడీ మీడియాలో తప్ప వాస్తవంలో కనిపించదు. భారీ రెక్కలతో నిత్యావసర వస్తువుల ధరలు అడ్డు ఆపు లేకుండా పైపైకి ఎగిరిపోతూ నిరుపేద, సామాన్యుల బతుకులు దుర్భరం చేస్తుంటే ఉత్తరాది ప్రజలు కూడా రాముడ్ని పక్కకు తోసి ఆకలి తీర్చే ప్రభుత్వం కోసం ఆశగా చూస్తున్నారు.
ఇది మంచి పరిణామమే అయినా బీజేపీ కుట్రల ముందు ప్రజాతీర్పు నిలబడి గెలవగలదా అనేదే పెద్ద ప్రశ్న.
గెలుపు ధీమా ఉంటే.. ఇవన్నీ ఎందుకు?
బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నది అందుకే. పదే పదే ఈసారి ఎన్ డీఏ 400పైగా పార్లమెంటరీ సీట్లు సాధిస్తుందనీ, దక్షిణాదిన 85 సీట్లు కచ్చితంగా ఎన్‌డీఏ గెలుచుకుంటుందనీ గోడీ మీడియా కోడై కూస్తోంది. నిజంగా గెలుపు మీద అంత ధీమా ఉంటే ప్రాంతీయ పార్టీలను చీల్చాల్సిన అవసరం ఏంటి,? చిన్నా చితకా పార్టీలను కూడా ఈడీ దాడులతో బెదిరించి మరీ కూటమిలో కలుపుకోవలసిన అవసరం ఏంటి? ‘నన్ను పీఎం చెయ్యి, నిన్ను సీఎం చేస్తా’ – ప్రతీ ప్రాంతీయ పార్టీ నాయకుడితో ఇదే మోడీ డీలింగ్. 2019లో గెలుపు మీద ధీమా ఉండడంతో ప్రచారం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా ఫోటో షూట్లు చేసుకున్న మోడీ ఇప్పుడు మాత్రం దేశమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరమేంటి?
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 15 మధ్య కాలంలో మోడీ తమిళనాడు, కేరళల్లో 6 సార్లు పర్యటించవలసిన అవసరం ఏంటి? భయం కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సీఎంల అరెస్టులు ఏంటి?, ప్రతిపక్షాల అకౌంట్లు ఫ్రీజ్ చేయడం ఎందుకు? దక్షిణాది ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడం కోసం కాశీ తమిళ సంఘం, సింగోల్ డ్రామాతో పాటు ఆంధ్రప్రదేశ నుంచి విజయేంద్ర ప్రసాద్ (బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రైటర్), తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్నాటక వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పి.టి.ఉషలను పక్కా ప్లాన్ ప్రకారం రాజ్యసభకు నామినేట్ చేయడం ఎందుకు? ఓడిపోతామనే భయం ఒక్కటే కారణం. దక్షిణ భారతదేశం మీద వీరి ఆశకు అవకాశం ఉందా?
తమిళనాడు : ఉత్తరాది మతతత్వపార్టీకి స్థానం ఉంటుందా?
తమిళనాడులో 39 + పాండిచ్చేరి ఒక సీటుతో కలిపి మొత్తం 40 ఎంపీ సీట్లున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఎన్‌డీఏ నుంచి బయటికి రావడంతో బీజేపీ పిఎంకె పార్టీ (వీరప్పన్ ప్రభావం ఉన్న పార్టీ)తో, డిఎంకె, కాంగ్రెస్, లెఫ్ట్‌పార్టీలతోపాటు ఎండిఎంకె, కెడిఎంకె లాంటి పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. జయలలిత మరణంతో సరైన నాయకుడు లేక ఏడిఎంకె చాలా బలహీన పడింది. ఇదే అదునుగా అక్కడ బీజేపీ కుటిల రాజకీయాలతో ఏడిఎంకెని మరింత బలహీనపరిచి రెండో స్థానంలోకి రావాలని తెగ ఆరాటపడుతోంది. రజనీకాంత్ చరిష్మాని ఉపయోగించుకుని లాభపడాలని చూసిన బీజేపీకి ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేపీ కన్ను – నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకుని, అనర్గళంగా ప్రసంగించగల సత్తా కలిగిన- కర్నాటలో డీజీపిగా పనిచేస్తున్న అన్నామలై మీద పడింది. అతన్ని పార్టీలోకి చేర్చుకుని, తమిళనాడు బీజేపీ అధ్యక్షునిగా చేసి మోడీ మీడియాతో హైప్ మీద హైప్ ఇచ్చేసి అతనికున్న పాపులారిటీని వంద రెట్లు పెంచేసింది. షరామామూలే…..
అన్నామలై బీజేపీ కమ్యునల్ ఐడియాలజీతో మతరాజకీయాలు చేస్తూ ప్రజల్ని రెచ్చగొడుతూ పెరియార్, అన్నాదొరైలను కూడా విమర్శించేసరికి ఆగ్రహించిన పళనిస్వామి (ఎడిఎంకె అధ్యక్షుడు) ‘ మా నాయకుల్ని విమర్శిస్తారా, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారా? ఎన్‌డిఎతో ఎట్టిపరిస్థితుల్లో కలిసి పోటీ చేసే ప్రసక్తే లేద’ని తేల్చి చెప్పేశాడు. అయినా అన్నామలై అదే మతవిద్వేషపు రాజకీయాలు కొనసాగిస్తున్నాడు. ‘డీఎంకే హిందూ మతానికి ప్రమాదం , హిందూ దేవుళ్ళను అవమానిస్తున్నారని నార్త్‌లో పాడిన పాటే పాడుతున్నారు. ఇక్కడ బీజేపీకి అర్థం కాని విషయం ఏమంటే – మత రాజకీయాలు తమిళనాడులో పనిచేయవని. 1967 నుంచి 50 ఏళ్ళకు పైగా తమిళప్రజలు ఒకసారి డీఎంకె మరోసారి అన్నాడీఎంకె లకే అధికారాన్ని ఇచ్చారు తప్ప మరే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపలేదు. ఈ రెండు పార్టీలకూ మూలం ఒక్కటే. వీళ్ళ మధ్య ఎన్ని గొడవలున్నా ఇవి ఒకే భావజాలం నుంచి వచ్చినవి. ఈ రెండూ పెరియార్ ఆశయాల నుంచి ఉద్భవించిన పార్టీలు.
తమిళ ప్రజలకు పెరియార్ దేవుడితో సమానం. ఉత్తరాది ఆధిపత్యాన్ని నిరసిస్తూ ఆత్మగౌరవం పేరుతో ద్రవిడ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసి ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న గొప్ప మానవతామూర్తి పెరియార్.పెరియార్ మతాన్ని వ్యతిరేకిస్తాడు, దేవుడ్ని వ్యతిరేకిస్తాడు. భాషతో ఆధిపత్యాన్ని చెలాయించాలనుకునే ఉత్తరభారతాన్ని వ్యతిరేకిస్తాడు. హిందీ భాషను వ్యతిరేకిస్తాడు. ఇంగ్లీషువాడికంటే హిందీవాడు ఇంకా ప్రమాదం అన్నాడు పెరియార్. హిందు, హిందుత్వ, హిందీ బీజేపీ అనుసరించే విధానం. పెరియార్ భావజాలంలో పుట్టి, ఇప్పటికీ ఆయన ఆశయాలకు, ఆధర్శాలకు ఆత్మగౌరవానికి విలువనిచ్చి అదే ఎజెండాగా ముందుకెళ్ళే ఈ రెండు పార్టీలను దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకున్న తమిళ ప్రజలు ఇప్పుడు పెరియార్ భావాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీని ఆమోదిస్తారా?
నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు రాజస్థాన్ పారిశ్రామికవేత్త రామకృష్ణ దాల్మియా పేరు మీద తమిళనాడులో ఒక గ్రామానికి దాల్మియాపూర్ అని పేరు పెట్టారు. దానికి నిరసనగా ఒక యువకుడి నాయకత్వంలో తమిళ ప్రజలు రైల్వేపట్టాల మీద పడుకుని తీవ్రస్థాయిలో ఆంధోళనలు చేస్తే పోలీసులు ఆ యువకుడ్ని అరెస్టు చేసి జైల్లో వేశారు. అతనే 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ది గ్రేట్ కరుణానిధి.
పెరియార్ అసలు భారతదేశానికే వ్యతిరేకం. దక్షిణ భారతదేశం పూర్తిగా భిన్నమైనదని దీన్ని ప్రత్యేక ద్రవిడ్ దేశంగా చేయాలని పెరియార్ భావించారు. అన్నాదొరై ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రతిపాదన చేశారు. సెపరేట్ ద్రవిడ్ దేశాన్ని తమిళ ప్రజలు అమితంగా ఆకాంక్షించారు. తీవ్రంగా పోరాడారు. కానీ తెలుగు, కన్నడ , మలయాళ ప్రజల నుంచి సరైన స్పందన , మద్దతు లేకపోవడంతో ఆ ఉద్యమం చల్లారకతప్పలేదు.
ఇలాంటి తమిళనాట ఉత్తర ఆధిపత్య మతతత్వపార్టీకి స్థానం ఉంటుందా? మోడీ మీడియా తెగ అబద్ధాలతో తమిళనాడులో కోయంబత్తూర్, కన్యాకుమారితో కలిపి 6, 7 సీట్లను బీజేపీ ఖాతాలో వేసేసుకుంది. ఆ రాష్ట్రాలకి మోడీ 20 వేల కోట్ల వరాలు కురిపించాడు. కోయంబత్తుర్‌లో మోడీకి బ్రహ్మరథం పట్టారని మీడియా తెగప్రచారం చేస్తోంది. నిజంగా అక్కడ జనం నుంచి అంత ఆదరణే ఉంటే మోడీకి అంత సెక్యూరిటీ ఎందుకు? ఈ సెక్యూరిటీ చూస్తే మోడీ అత్యంత ప్రమాదకరమైన , ప్రాణహాని ఉన్న శత్రు దేశంలో పర్యటిస్తున్నాడా అన్న అనుమానం కలగకమానదు. ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు, గోబ్యాక్ మోడీ అనే నినాదాలతో , ప్లకార్డ్‌లతో తమిళ జనం ర్యాలీలు చేస్తుంటే మోడీ మీడియా అవేవీ ప్రజల కంట పడకుండా చాలా జాగ్రత్త పడుతోంది.
కనీసం బ్రాహ్మణ వర్గాన్నయినా తమ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో హిట్లర్ యూదులపట్ల వ్యవహరించిన విధంగా డీఎంకె బ్రాహ్మణులపట్ల వ్యవహరిస్తోందనీ, హిందూ మతాన్ని అవమానిస్తోందనీ అన్నామలై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు అక్కడి ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తాయా ? మొన్నటి ఎన్నికల్లో అన్నామలైని తమిళ ప్రజలు ఓటమిపాలు చేశారన్న విషయాన్నీ మర్చిపోలేము. ఏడీఎంకేకి ప్రస్తుతం ప్రాబల్యం తగ్గినా 2, 3 సీట్లన్నా వచ్చే అవకాశం ఉంది కానీ బిజేపి తమిళనాట ఖాతా తెరిచే అవకాశాలు ఇప్పట్లో అయితే కనిపించట్లేదు. (భవిష్యత్‌లో చెప్పలేము) పియమ్‌కెతో పోత్తు ఉన్నా ఆ పార్టీకి ఉత్తర తమిళనాడులో మాత్రమే కొంత బలం ఉంది. కానీ బీజేపీ కాస్తోకూస్తో ప్రభావం చూపించేది దక్షిణ తమిళనాడులో కాబట్టి ఓట్ల బదిలీ కూడా కష్టమే. శాసన సభలో గవర్నర్ జోక్యంతో ప్రతీ బిల్లుని అడ్డుకొంటూ తమిళ ప్రజల్ని ఘోరంగా అవమానిస్తున్న బీజేపీ ఆధిపత్యానికి తమిళ ప్రజలు తల వంచుతారనుకోవడం ఒట్టి భ్రమే అవుతుంది.
కేరళ : రైట్ వింగ్ పాలిటిక్స్ ఇక్కడ పనిచేస్తాయా?
కేరళలో మొత్తం 20 పార్లమెంటరీ సీట్లున్నాయి. ప్రధాన పార్టీలు లెఫ్ట్ , కాంగ్రెస్ . ఈ రెండు పార్టీల మధ్య అంసెబ్లీ ఎన్నికల్లో పోటీ కనిపిస్తుంది తప్ప పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఉండదు. కేరళ ప్రజలు చాలా స్పష్టంగా ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీనీ , పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ లోకల్ పార్టీగా ఉంది. కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కేరళ ప్రజలు కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతారు. ఇక లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌కు మిత్రపక్షమే కాబట్టి కేరళలో ఉన్న మొత్తం 20 సీట్లు కాంగ్రెస్ అంటే ఇండియా బ్లాక్ (ఇండియా కూటమి) ఖాతాలోనే వేసుకోవాలి. అయితే ఒకవైపు 2024 ఎన్నికల కోసం గత మూడు నెలలుగా మోడీ కేరళలో విస్తృతంగా పర్యటించి వ్యూహాలు రచిస్తుంటే మరోవైపు మోడీ మీడియా కేరళలో మూడు సీట్లను ఎన్‌డిఎలో కలిపేసింది.
శబరిమలై ఉదంతంతో కొంత లాభపడిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అదే మతతత్వాన్ని రెచ్చగొడుతూ తనకున్న ఏకైక ఆయుధాన్ని బలంగా ప్రయోగిస్తోంది. అయితే కేరళలో రైట్ వింగ్ పాలిటిక్స్ పనిచేస్తాయా? 2016 అసెంబ్లీ ఎన్నికలో మొట్టమొదటిసారిగా కేరళలో బీజేపీ ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుంది. ‘కేరళలో అక్షరాస్యత ఎక్కువగా ఉండడమే పెద్ద సమస్య అనీ, అందుకే బీజేపీ రాణించలేకపోతుందనీ బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ వ్యాఖ్యానించారంటే బీజేపీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ తిరువనంతపురం మీద కన్నేసింది. తిరువనంతపురంలో మూడుసార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్ మీద పోటీగా బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ని బరిలోకి దింపింది. హిందువులను రెచ్చగొట్టి మొత్తానికి కొంత ఓటుబ్యాంక్ సంపాదించుకుంది. బీజేపీకి ఓట్ షేర్ 13% ఉంది కాబట్టి 2, 3 సీట్లు కచ్చితంగా వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు. కేరళలో హిందువుల జనాభా 53% మాత్రమే. 13% పోయినా 40% హిందువులు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. ఇక క్రిస్టియన్ ఓటర్లను బీజేపీ వైపుకు మళ్ళించేందుకు మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీని రాష్ట్రబీజేపీ అధ్యక్షునిగా చేసి పతనంతిట్ట నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది బీజేపీ . క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉన్న మరో నియోజకవర్గం త్రిస్సుర్. ఇక్కడ ప్రఖ్యాత సినీనటుడు సురేష్ గోపీని నిలబెట్టింది. అయితే మణిపూర్ దుర్ఘటన, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్‌లలో క్రిస్టియన్ల మీద , చర్చిల మీద పదే పదే జరిగిన దాడులు అన్నీ మర్చిపోయి క్రిస్టియన్లు బీజేపీకి ఓటు వేసే అవకాశముందా? అందులో కేరళ ప్రజలు??? !!! కచ్చితంగా ఉండదు.
కర్నాటక : బీజేపీ అరాచక పాలన జనం మర్చిపోలేదు
కర్నాటకలో మొత్తం 28 పార్లమెంట్ సీట్లుంటే 2019లో బీజేపీ 25 గెలుచుకుంది. మంధ్యా పార్టమెంట్ స్థానంలో ఇండిపెండెంట్ పోటీచేసి లక్ష మెజారిటీతో దేవగౌఢ కుమారుడు కుమారస్వామి మీద విజయం సాధించిన సినీనటి సుమలత తర్వాత బీజీపీతో కలవడంతో మొత్తం 26 ఎంపీ సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి. కుమారస్వామి ప్రభావం కావచ్చు, ఈసారి బీజీపీ సుమలతకు సీటు ఇవ్వలేదు. పేరులో సెక్యులర్ పెట్టుకున్న దేవగౌఢ జేడిఎస్ బీజేపీతో కలిసిపోటీ చేస్తోంది. కర్నాటకలో లింగాయత్ ఓటర్లు అత్యంత కీలకం కాబట్టి మోడీ యడ్యూరప్పని ప్రసన్నం చేసుకోవడానికి అతని కుమారుడికి అధ్యక్ష పదవి కట్టబెట్టాడు. ఎన్ని చేసినా 2018లో కుట్రపూరితంగా అధికారంలోకి వచ్చి కర్నాటకలో బీజేపీ చేసిన అరాచక పాలన ప్రజలు మర్చిపోలేదు. బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతకు నిదర్శనమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ ల నేతృత్వంలో ఇప్పుడు కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఏవిదంగా చూసినా ఈసారి బీజేపీకి కర్నాటకలో భారీ నష్టం జరగనుంది. 10-15 సీట్లు కోల్పోక తప్పదు.
తెలంగాణ: ఈసారి బీజేపీకి 3 సీట్లొస్తే గొప్పే
తెలంగాణ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. గతంలో గెలుచుకున్న నాలుగు స్థానాల్ని కూడా బీజేపీ నిలబెట్టుకుంటుందన్న నమ్మకం లేదు. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల సిట్టింగ్ ఎంపీలను కూడా పక్కన పెట్టవలసిన ఆగత్యం ఏర్పడడం. దాంతో పార్టీలోనే అంతర్గత కలహాలు. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఎంతోకాలంగా బీజేపీ కోసం పనిచేస్తున్న వాళ్ళను పక్కనబెట్టి కొత్తగా పార్టీలో చేరినవారికే ప్రాధాన్యం ఇవ్వడంతో అసంతృప్తులు ఎక్కువయ్యాయి. మరో వైపు కాంగ్రెస్ బలం పెంచుకుంటోంది.
2019లో పరిస్థితి వేరు. ప్రజల్లో బిఆర్ ఎస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న తెలంగాణ ప్రజలకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బీజేపీ రాష్ట్రంలో రెండవ పార్టీగా ఎదగాలని చూసింది. నాలుగు ఎంపీ స్థానాలు సంపాదించుకుంది. కానీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ విజయం తెలంగాణ ప్రజలకు ప్రస్తుతానికి ఒక ప్రత్యామ్నాయాన్ని చూపించింది. ఫలితంగా బీజేపీని రెండో స్థానం నుంచి మూడో స్థానానికి నెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. ఉద్యమాలకు పురిటిగడ్డగా ఉన్న తెలంగాణలో కూడా రైట్ వింగ్ పాలిటిక్స్ , మత రాజకీయాల ప్రభావం పెద్దగా ఉండదు. తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంటరీ స్థానాల్లో ఈసారి బీజేపీకి 3 సీట్లు వస్తే గొప్ప.
ఆంధ్రప్రదేశ్ : బీజేపీ ఖాతాలోకి ఒక్కసీటూ వెళ్ళదు.
ఆంధ్రాలో బీజేపీ, కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలకూ ఎలాంటి ప్రాధాన్యం లేదు. ఈ రెండు పార్టీలకూ ఓట్ షేర్ ఒక్క శాతం కూడా లేదు. ఇక్కడి ప్రజలు ప్రాంతీయ పార్టీలకు తప్ప ఈ జాతీయ పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయి. ఆ పార్టీలకు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఇక్కడ తెలుగుదేశం, జనసేనతో కలిసి బీజేపీ పొత్తుపెట్టుకుంది. విభజన హామీల మాట లేదు, స్పెషల్ స్టేటస్ ఊసు లేదు. పోలవరం, విశాఖ ప్రైవేటీకరణ సంగతి లేదు. కనీసం ఒక రైల్వే జోనల్ ఇచ్చే మాట కూడా లేదు బీజేపీ నుంచి. అయినా ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి ఒరిగేదేంటో ఎవ్వరూ చెప్పరు. ఈ మూడు పార్టీలూ సొంత ప్రయోజనాల కోసం కూటమిగా ఏర్పడినా ఈ బలవంతపు పొత్తులో ఒకరితో ఒకరికి సఖ్యత లేదు, గౌరవం లేదు. సీట్ల సర్దుబాటులో పేచీలు, అభ్యర్థుల నియామకంలో పేచీలు….. మరో వైపు అధికార పార్టీ మీద పాలనా పరమైన విమర్శలు చేయలేక (అది ప్రజా వ్యతిరేకం అవుతుంది కాబట్టి) కేవలం వ్యక్తిగత దూషణలే ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రాలుగా మారడం విచిత్రమైన పరిస్థితి.
జగన్‌కి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తప్ప తాము అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచి ఏంటో చెప్పరు. చెప్పినా చంద్రబాబు గత చరిత్ర బాగా తెలిసిన ఆంధ్రా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జగన్ పథకాలతో రాష్ట్రం అప్పులమయమైందంటూనే అంతకు పదింతల పథకాలు చేస్తామంటారు. జగన్ హయాంలో రాష్ట్రంలోకి ఎన్ని కంపెనీలు వచ్చినా , పెట్టుబడులు వచ్చినా, పోర్టులు, తాగునీరు-సాగునీరు ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు వచ్చినా, ప్రభుత్వ స్కూళ్ళు, ఆసుపత్రులు ఎంత అధునాతనంగా, అద్భుతంగా రూపుదిద్దుకున్నా ఇవి ఏవీ అభివృద్ధి కాదు అని, అసలు అభివృద్ధే జరగట్లేదని ప్రతిపక్ష మీడియా అబద్ధపు రాతలతో ఒక సెక్షన్ జనాన్ని బాగానే మేనేజ్ చేయగలిగింది కానీ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందే జనాలను జగన్‌కి వ్యతిరేకంగా మార్చలేకపోతోంది.
పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వాలన్నీ బూర్జువాల కోసమే పనిచేస్తాయి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు కూడా బూర్జువాల మేలుకోసమే పనిచేశాడు తప్ప పేదలకూ, సామాన్యులకూ చేసింది ఏమీ లేదు. భూముల రూపంలో , బ్యాంకుల రుణాల ఎగవేతల రూపంలో ఇంకా అనేకానేక రూపాల్లో మన ప్రభుత్వాలు లక్షల కోట్ల ప్రజా ధనాన్ని పదిమంది కార్పొరేట్లకు కట్టబెడుతూ ఉంటాయి. కానీ దాన్ని కడుపునిండా తిండిలేని లక్షలాది నిరుపేదలకు పంచితే అందులో వ్యతిరేకత ఎందుకుండాలి? ఎవరికుంటుంది? పేదల ఇంగ్లీష్ చదువులు, నిలువ నీడలేని పేదలకు ఇళ్ళు ఇవ్వడాన్ని ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కూడా వ్యతిరేకిస్తున్నారంటే అది కమ్యూనిజానికే సిగ్గుచేటు. చిన్న పిల్లలు కూడా కూలి పనికి వెళితే తప్ప పూట గడవని పేద కుటుంబాలు చదువుకి దూరం కాకుండా అమ్మ ఒడి పేరుతో కుటుంబానికి డబ్బు ఇస్తే అది ఎంత మంచిపని , పేద పిల్లలకు మంచి భోజనం పెట్టి , బట్టలు, పుస్తకాలు, బ్యాగులు, షూజ్, ట్యాబులు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలల స్థాయిని కనీ వినీ ఎరుగని రీతికి తీసుకెళితే ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు ఎంత ఆనందం ఉంటుంది. కార్పొరేట్ స్కూల్ పిల్లలతో పోల్చుకుని ఆత్మన్యూనతకు గురి అయ్యే స్థాయి నుంచి కార్పొరేట్లకు ధీటుగా ఆత్మవిశ్వాసం పెంచుకునే అవకాశం కల్పించడం ఎంత మంచి పని.
పేదలకు రోగాలొస్తే ముక్కు మూసుకుంటే తప్ప భరించలేని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం లేక దిక్కులేని చావు చచ్చే స్థాయి నుంచి గవర్నమెంట్ హాస్పిటళ్ళను సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ స్థాయికి తీసుకెళ్లి పైసా ఖర్చులేకుండా పేదలకు ఫైవ్ స్టార్ వైద్యం అందజేయడం ఎంత గొప్ప విషయం. కిడ్నీ రీసెర్చ్ సెంటర్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరాతో ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం వైపు అడుగులు ఏపీ ప్రభుత్వం వేయడం అభినందనీయ.
రైతు భరోసా, ఫామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వంటి ఇన్నో పథకాలతో పేదలకు మేలు చేస్తున్న వైఎస్ ఆర్ సిపి వైపే రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజలు ఉన్నారనడంలో సందేహం లేదు. ‘ మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి, లేకపోతే వేయవద్దు’ అని జగన్ సూటిగా అడుగుతున్నాడు. నాయకులు ఈ పద్ధతిలో ఓట్లు అడగడం అనే ప్రక్రియని ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రతిఒక్కరూ స్వాగతించాల్సిన విషయం. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖమంత్రిగా ఉన్నాడంటే ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు చేసే అవకాశముంది కదా. నా పాలన, జగన్ పాలన పోల్చి చూసుకోండి మీకు నా పాలనలోనే ఎక్కువ మంచి జరిగిందనుకుంటే నాకు ఓటువేయండి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా టైమ్‌లో ప్రజలకు చేసిన సేవ నిజాయితీ ఉంటే విమర్శకులు కూడా ప్రశంసించాల్సిన గొప్ప విషయం . ఇన్నిచేసినా జగన్ చేసిన అప్పు చంద్రబాబు 2014 నుంచి 19 వరకు చేసిన అప్పు కంటే తక్కువ.పేదల బాగు కోరుకునే ఎవ్వరైనా చంద్రబాబు పాలనతో పోల్చితే జగన్ వెయ్యి రేట్లు బెటర్ అని ఒప్పుకోక తప్పదు.
ఆంధ్రాలో కూటమి గెలిచే అవకాశాలు కనిపించకపోవడంతో ఎన్నికల తర్వాత వైసిపిని ఎన్‌డిఏలో చేర్చుకునే ప్లాన్‌లో మోడీ ఉన్నాడన్న విషయం చిలకలూరిపేటలో కూటమి నిర్వహించిన సభలో మోడీ వ్యవహరించిన తీరు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఎన్‌డిఎకి స్పష్టమైన మెజారిటీ రాకపోతే జగన్ మాత్రమే కాదు ఇప్పుడు ఎన్‌డిఏలో ఉన్న చాలా పార్టీలు కూడా ఫలితాల తరవాత బీజేపీకి అండగా ఉండే అవకాశముండదు. రాష్ట్రాల నుంచి బలవంతంగా పార్టీ ఫండ్‌లు వసూలు చేస్తూ , ఈడీ కేసులతో బెదిరిస్తూ పక్కలో బల్లెంలా ఉండే బీజేపీకి మద్ధతు ఇవ్వాలని ఏ పార్టీ అనుకోదు. రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం దానికోసం కాంగ్రెస్ కు అయినా మద్ధతు ఇస్తానని జగన్ గతంలో ప్రకటించాడు.
ప్రస్తుతం రాజ్యసభలో సభ్యత్వాన్ని పూర్తిగా కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి లోక్ సభ సీట్లు కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. 25 లోక్‌సభ స్థానాలున్న ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీకి 20వరకు వచ్చే అవకాశముంది. చెల్లని నాణానికి గీతలెక్కువ అని పవన్ కళ్యాణ్ ని లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. తెలుగుదేశానికి 5, 6 సీట్లు వచ్చినా ఎన్నికల తర్వాత చంద్రబాబు ఎన్‌డిఎలో ఉంటాడన్న గ్యారంటీ లేదు. కాబట్లి ఈ రాష్ట్రంలో బీజేపీ ఖాతాలోకి ఒక్కసీటు కూడా వెళ్ళదు.
బీజేపీ మళ్ళీ వస్తే జరిగే అనర్థాలు
పాలనలో అన్యాయాలు, దౌర్జన్యాలు మొదటిసారి అధికారంలోకి వచ్చిన దానికంటే వందల రెట్లు రెండోసారి చేసి చూపించిన బీజేపీ మూడోసారి వస్తే జరిగే అనర్థాలకు అంతం ఉండదు. ఊహకందనివి లెక్కలేనన్ని ఉన్నా బీజేపీ కచ్చితంగా అమలు పరిచేవి మచ్చుకకి కొన్ని. లౌకికత్వానికి పూర్తిగా చరమగీతం పాడి ఈ దేశాన్ని సంపూర్ణ మతరాజ్యంగా మార్చేస్తారు. పౌరసత్వం మతం ఆధారంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని మూల పడేసి మనువాద చట్టాలు అమల్లోకి వస్తాయి. ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసి రాష్ట్రాల ప్రాతినిద్యాన్ని నామమాత్రంగా చేసి కేంద్రం బాగా బలపడుతుంది. ఇప్పటికే గవర్నర్లను ఎలా వాడుకుంటుందో చూస్తున్నాము. అప్పడు రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం మీద ఆధారపడవలసి వస్తుంది. ఇక ప్రభుత్వ సంస్థల మాట కూడా లేకుండా అన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి.
ఈ దేశం ఇప్పటికే అంబానీ, అదానీల కనుసన్నల్లో నడుస్తోంది. ఇక మూడోసారి కూడా బీజేపీకి పట్టం కడితే, ఈ దేశం వాళ్ళ చెప్పు చేతల్లో బతకాల్సిందే. యూనిఫామ్ సివిల్ కోడ్, వ్యవసాయ కోడ్ అమల్లోకి వస్తాయి. ఒన నేషన్ , ఒన ఎలక్షన్ అమలు చేస్తారు. ఇక అన్నిటికంటే ప్రమాదకరమైంది, ముఖ్యంగా దక్షిణ భారత ప్రజలకు శాపంగా మారేది డీలిమిటేషన్ పద్ధతి.
జనాభా ఆధారంగా పార్లమెంట్ నియోజక స్థానాల విభజన. అంటే ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి నియోజక వర్గ స్థానాల సంఖ్య బాగా పెరుగుతుంది. అప్పుడు పార్లమెంట్‌లో సౌత్ ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా దక్షిణ రాష్ట్రాల్లో ఒక్క సీటు రాకపోయినా ఈ రాష్ట్రాలతో అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి.
వాస్తవానికి జనాభానియంత్రణ అనేది అభివృద్ధిలో భాగం. ఈ అభివృద్ధి సాధించినందుకే దక్షిణ రాష్ట్రాలకు శిక్ష. ప్రాతినిధ్యం తగ్గడమనేది ఎంత అన్యాయం! సాధారణంగా ఉత్తరాది ప్రజలు ఉపాధి కోసం దక్షిణ రాష్ట్రాలకు వలస వస్తుంటారు. ఎన్నికల సమయంలో సొంత రాష్ట్రాలకు వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఏ రకంగా చూసినా డీలిమిటేషన్ అనేది దక్షిణ రాష్ట్రాలకు తీరని అవమానం. అసలు ఇవన్నీ అవసరం లేదు. బీజేపీకి మరోసారి అవకాశమిస్తే ఈడీల అవసరం కూడా లేకుండా అసలు ఎన్నికల రూపురేఖలే మార్చేస్తుంది. ఒన్ నేషన్ , ఒన్ ఎలక్షన్ నే కాదు ఒన్ పార్టీ అనేది తెస్తుంది. బీజేపీ పార్టీ ఒక్కటే ఉంటుంది. ఉత్తర కొరియా టైప్‌లో ఎన్నికలు జరుగుతాయి . అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఒక్క బీజేపీ పార్టీనే ఉంటుంది. అందరూ దానికే ఓటు వేయాలి.
ఇప్పటికైనా మేలుకుని బీజేపీని తరిమికొట్టకపోతే ఈ దేశ భవిష్యత్ అంతా అంధకారమే.
2024లో అధికారంలోకి వచ్చేది ఎవరు??
———————————————
ఎన్నికలు పారదర్శకంగా జరిగితే, నిజంగా ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వచ్చే పనైతే నూటికి నూరు శాతం బీజేపీకి మళ్ళీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే లేదు. కానీ ఈ దేశాన్ని సంపూర్ణంగా దోచుకోవాలంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావడం అంబానీ, ఆదానీ లాంటి కొందరు బడా బడా దొంగలకు చాలా అవసరం కాబట్టి తమ ప్రియతమ తోలుబొమ్మ మోడీని మళ్ళీ గద్దెనెక్కించడానికి తమకున్న ఆర్ధిక బలాన్ని ఉపయోగించి ఎలాంటి కుట్రలు కుతంత్రాల కైనా వెనకాడరు.
ఆ కుట్రలను, ఈవీఎంల మోసాలను ప్రతిపక్షాలు ఎంత సమర్థవంతంగా ప్రతిఘటించి నిలబడగలుగుతాయనే దాని మీదే నెక్స్ట్ పీఎం పీఠం, ఈ దేశ భవిష్యత్తు రెండూ ఆధారపడి ఉంటాయి.
పది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టే ధైర్యం లేని మోడీ నిజాయితీకి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది?!!!!

