Vanaja Che
[Summary in English
Love our country
Leave patriotism
‘To abolish war it is necessary to abolish patriotism, and to abolish patriotism it is necessary first to understand that it is an evil” said Leo Tolstoy.
We now can understand clearly how patriotism is dangerous and how it became a tool to destroy our country in the present BJP’s regime.
Hate Pakistan… Hate the Muslims , even though they are our fellow citizens. These are new definitions for patriotism which are prevailing.
According to the so-called patriots, PM Modi successfully resolved the Kashmir issue with the abolition of the 370 article. If it is true, why did the recent Pahalgam Terror attack took place? So called patriots don’t dare to think about it. The media doesn’t question the attacks on Kashmir after Modi came to power.
Does Modi’s inefficient rule which could not foresee the terror attack, which is unable to nab culprits become a powerful rule just for a worthless warning of not to give Sindhu river water. Is it possible to stop flowing river water? After stopping it, where to retain the water ?
If they have real guts they need to nab and punish the terrorists severely. Need to destroy Pakistan’s financial and political strongholds. It is unfair to suffer the innocent people of Pak.
The target of Pak terrorists is to create and enhance hatred among religions in our country . The BJP’s target is to utilise this unrest and secureless fearful atmosphere to gain power and sell the country to corporates. So we can say that BJP is fulfilling the dreams of terrorists.
Editorial Note
In our understanding true patriotism is love for the people of our country the bulk of whom live in acute poverty.]
దేశ భక్తిని వదిలిపెట్టవోయ్, దేశాన్ని ప్రేమించవోయ్ ******** “యుద్దాన్ని పతనం చేయాలంటే ముందుగా దేశ భక్తిని పతనం చేయాలి” అన్నాడు లియో టాల్ స్టాయ్. దేశ భక్తి అనేది ఎంత ప్రమాదకరమో, అది దేశ వినాశనానికి సాధనంగా ఎలా ఉపయోగపడుతోందో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ పరిస్థితుల్ని కాస్త బుర్ర పెట్టి పరిశీలిస్తే ఎవరికైనా స్పష్టంగా అర్థమౌతుంది. దేశ భక్తి అంటే పాకిస్థాన్ మీద ద్వేషం దేశ భక్తి అంటే మన దేశంలో మనతోపాటు జీవించే ముస్లింల మీద ద్వేషం దేశ భక్తి అంటే సాటి మనిషిని మనిషిగా చూడలేని ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న ద్వేషం. దేశ భక్తి అంటే పూర్తిగా ద్వేష భక్తిగా మారిన వైనం. దశాబ్దాలుగా రగిలిపోతున్న కాశ్మీర్ సమస్యను మోడీ 370 ఆర్టికల్ తో అద్భుతంగా పరిష్కరించేశాడని చంకలు గుద్దుకున్న ఈ దేశ భక్తులకు మళ్ళీ ఇప్పుడీ ఉగ్రదాడులు ఎందుకు జరుగుతున్నాయన్న ఆలోచన అస్సలు రాదు. ముందు ప్రభుత్వాల కంటే మోడీ అధికారంలోకి వచ్చాకే కాశ్మీర్ పై దాడులు వేల సంఖ్యలో పెరిగాయనే పచ్చి నిజాన్ని ఏ మీడియా చెప్పదు. 50 సెకండ్ల మాటలు కట్ చేసి… —————————- ఈ ఘటనకు భద్రతా వైఫల్యమే కారణమని, తప్పు జరిగిందని స్పష్టంగా చెప్పిన పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు తర్వాత తను మాట్లాడిన వీడియోని తనే ప్రభుత్వ తప్పిదానికి సంబంధించిన 50 సెకండ్ల మాటలు కట్ చేసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాని గురించి ఏ మీడియా నోరెత్తలేదు. పైగా ప్రజల దృష్టిలో పడకుండా దాన్ని దాచి ప్రభుత్వానికి కలిసికట్టుగా గులాంగిరీ చేసింది మీడియా. కార్పొరేట్ల ప్రయోజనాలే ముఖ్యం —————————- జాతీయ రక్షణ ప్రోటోకాల్ ప్రకారం పాకిస్తాన్ సరిహద్దు నుండి 10 కి.మీ. వరకు పెద్ద నిర్మాణాలు చేపట్టడం నిషిద్ధం. అయితే అదానీ పునరుత్పాదక ఇంధన ఉద్యానవన నిర్మాణానికి మార్గం సుగమం చేయడం కోసమే , కేవలం అదానీ ప్రయోజనాల కోసమే మోడీ ప్రభుత్వ పాకిస్తాన్ సరిహద్దులో జాతీయ భద్రతా ప్రోటోకాల్ ని సడలించింది. వివాదాస్పద సరిహద్దు నుండి 1 కి.మీ. లోపలే అదాని ప్రాజెక్టుకు అనుమతినిస్తూ, 25 వేల హెక్టార్ల భూమిని అదానీకి అప్పనంగా కట్టబెట్టి దేశ భద్రతను సంక్షోభంలో పడేసింది. కార్పొరేట్ల మీద ప్రేమను చాటుకోడానికి దేశ సంపదను వారికి ధారాదత్తం చేయడమే కాదు, దేశ రక్షణ కూడా పణంగా పెట్టగలమని నిరూపించుకుంది మోడీ ప్రభుత్వం. అయినా మోడీ దేశభక్తుడు, ఆయన్ని అభిమానించేవారు వీర దేశభక్తులు. ఘోర వైపల్యం కప్పిపుచ్చుకుంటూ…. —————————— ఈ దాడుల తర్వాత, పాకిస్థాన్ మీద ఒక కన్నేసి ఉంచడానికి స్పెషల్ స్పై ఉపగ్రహ పనితీరుని వేగవంతం చేస్తామని సిగ్గులేకుండా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. నిఘా కోసం ఇస్రో స్పెషల్ స్పై శాటిలైట్ ని 2019లోనే లాంచ్ చేసింది. మరి ఇంత కాలం ఇది ఏం చేస్తున్నట్టు? ఉగ్రవాదుల రాకను ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఇది ఎవరు ప్రశ్నిస్తారు??!! భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉంటే ఉగ్ర దాడులు ఎలా జరుగుతాయని గతంలో కాంగ్రెస్ ని ప్రశ్నించాడీ విశ్వ గురువు. ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగాక కూడా ఘోరమైన తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడమేగాక ఈ దుర్ఘటనని తన రాజకీయ క్రీడకు వాడుకుంటూ ప్రజల మధ్య మరింత చిచ్చు పెడుతున్నాడు. మరి ఈ నీచత్వాన్ని ప్రశ్నించేదెవరు? సోషల్ మీడియాలో దేశ భక్తుల వీరంగం ——————————– ఉగ్రదాడిని ముందుగా కనిపెట్టలేని, అది జరిగి ఐదు రోజులైనా నేరస్థులను పట్టుకోలేని మోడీ అసమర్ధ పాలన కాస్తా “మీకు నీళ్ళివ్వం పో ” అనే తాటాకు చప్పుళ్ల హెచ్చరికలకే శక్తిమంతమైన పాలనగా మారిపోతుందా? ఈ దెబ్బతో మోడీ భక్తులంతా (దేశ భక్తులు ) ఊగిపోతున్నారు. పాకిస్థాన్ కి తగిన శాస్తి జరిగిందని ! బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో పీహెచ్డీ పట్టాలు పుచ్చుకున్న దేశభక్తులైతే… ‘ఈ తతంగం అంతా ఎందుకు? ఓ పెద్ద బాంబు వేసి పాకిస్థాన్ని పూర్తిగా మట్టి కరిపిస్తే పోయేదానికి ‘ అంటూ ఉచిత సలహాలతో సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నారు. పాకిస్థాన్ కి సింధూ జలాలు నిలిపివేయడం అనేది చైనా యాప్ తొలగించినంత ఈజీ అనుకుంటున్నారా!!! పారే నదీ జలాలను నిలిపేసి ఆ నీటిని ఎక్కడ పెట్టుకుంటారు?!!! ఈ మాత్రం మోడీకి తెలియదా?!! అన్నీ తెలుసు. అయినా చెప్పాడంటే… ప్రజల్ని మోసం చేయడం ఇంకా బాగా తెలుసు. ఒకవేళ అది సాధ్యమైనా కూడా ఈ సమస్యకు పరిష్కారం అదా?!!! అది మానవీయ చర్య అవుతుందా? నేరం చేసింది ఎవరు? శిక్ష ఎవరికి? —————————— నిజానికి భద్రతా వైఫల్యమే కారణం కాబట్టి దేశం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, గౌరవం ఉన్నా ఈ దాడులకు కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి మోడీ రాజీనామా చేయాలి. అది చేయకపోగా ఇంత మంది పర్యాటకులు చనిపోతే కనీసం పరిస్థితి వివరిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా ఈ దేశభక్త మోడీ ప్రభుత్వానికి లేదు. పాకిస్థాన్ కి నీళ్లు నిలిపేస్తే ఇబ్బంది పడేది ఎవరు? టెర్రరిస్టులా?!!!! ఆ దేశ అధికారులా?!!!! ఇద్దరూ కాదు. నిజానికి ఇబ్బంది పడేది ఆ దేశ సామాన్య ప్రజలు మాత్రమే. చేతనైతే టెర్రరిస్ట్ లను పట్టుకుని కఠినంగా శిక్షించాలి, ఆ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్ అధికారుల ఆర్ధిక, రాజకీయ మూలాలు కదిలించి చావు దెబ్బతీయాలి. అంతే కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మన ప్రతాపాన్ని అమాయక ప్రజల మీద చూపిస్తే, అలాంటి అమానుష చర్య వల్ల ప్రపంచ కుగ్రామంలో నష్టపోయేది మన దేశమే. అబద్ధాలూ… విద్వేషాలూ ———————- జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఆదాయం టూరిజం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భద్రత మరింత కట్టుదిట్టం చేసి పర్యాటకులకు సురక్షితమైన సదుపాయాలు కల్పిస్తామనే గట్టి భరోసాను ఇవ్వాల్సిన క్లిష్ట సమయం ఇది. కానీ అసత్యాలతో విద్వేషాలు రెచ్చగొడుతూ కాశ్మీర్ ఆదాయానికి గండీ కొడుతూ మొత్తం దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళుతున్న బీజేపీ గొప్ప దేశభక్తి కలిగిన పార్టీ !!! ఉగ్రవాదులు చంపింది మనుషులను, భారతీయులను అని కాకుండా హిందువులను మాత్రమేనని పాంట్లు విప్పి చూసి మరీ చంపారని అబద్ధపు ప్రచారంతో హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న బీజేపీ గోడీ మీడియా ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటోంది???. పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆర్ ఎస్ ఎస్, బీజేపీ, పవన్ కళ్యాణ్ లాంటి మతోన్మాదులు దానికి ఒక ఆకు ఎక్కువే తీసుకెళ్తున్నారు . భారతదేశంలో మతాల మధ్య చిచ్చు రగిలించడమే పాక్ ఉగ్రవాదుల లక్ష్యం అయితే అదే మతాల మద్య చిచ్చు రగిల్చి వాళ్ళు కొట్టుకు చస్తుంటే ఆ రక్తపు మడుగులో అధికారపీఠాన్ని దర్జాగా వేసుకుని కార్పొరేట్ దొంగలకు దేశాన్ని దొచిపెట్టడం బీజేపీ లక్ష్యం. ఉగ్రవాదుల ఆశయాన్ని బీజేపీ సమర్థవంతంగా నెరవేర్చుతోంది. ఈ దేశ ముస్లింలకు ఏం సంబంధం ? —————————— ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ‘హిందువులనే కాదు ముస్లిం యువకుణ్ణి కూడా చంపారు కదా’ అని అడిగితే , ‘ అతడు హిందువులకు సాయం చేయబోయినందుకే చంపారట, లేకపోతే చంపేవారు కాదట’ . సరే, నిజంగా వాళ్ళు హిందువులను మాత్రమే చంపారనుకుందాం. మరి అలాంటి పాక్ ఉగ్రవాదుల దరిద్రపు చర్యల్ని భారతదేశం లోని ముస్లింలకు ఇక్కడి హిందువులతో కలిసిమెలిసి తిరుగుతూ అవసరమైతే హిందువులకు అండగా నిలిచే ముస్లింలకు ఆపాదించడం ఎంతవరకు న్యాయం?!!! ఈ దుర్ఘటనతో భారతదేశంలోని ముస్లింలకు ఏంటి సంబంధం?!! మనదేశ క్షేమాన్నే కోరుకునివుంటే.. —————————– కేంద్ర ప్రభుత్వం నిజంగా భారతదేశ క్షేమాన్నే కోరుకుంటే, దేశ అభివృద్ధినే ఆకాంక్షిస్తే ఈ దాడిలో నిజంగా పాంట్లు విప్పి చూసి హిందువులను మాత్రమే చంపినా కూడా అది కేవలం పాక్ ఉగ్రవాదుల సంకుచిత చర్యగానే భావించి పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంతమంది మనుషులు చనిపోయారు, ఇంతమంది భారతీయులు చనిపోయారు అనే విషయానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేది . వాళ్ళు మన దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టి అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి, ఉగ్రవాద చర్యలు తిప్పికొట్టాలంటే దేశంలో హిందూ ముస్లిమ్స్ అందరూ మునుపటికంటే ఎక్కువగా కలిసికట్టుగా ఉండాలని ఎలుగెత్తి చాటేది. సమతా గ్రామాల సామరస్యం ————————— ఒకసారి తమిళనాడులో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల అహంకారంతో కొందరు దళితుల్ని సజీవ దహనం చేస్తే ఆ ఘటనకు చలించిపోయిన కరుణానిధి “సమతాపురం” గ్రామాలు అనే అద్భుత ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. వందల గ్రామాలు నిర్మించాడు. ఒక్కో గ్రామంలో వంద ఇళ్లు. 40 దళితులకు, 25 బీసీలకు, 25 ఇంకా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు 10 ఇతరులకు. ఊరి మొత్తంలో ఒక కమ్యూనిటీ హాల్. ఎవ్వరింట్లో ఏ శుభకార్యమైనా అక్కడే చేసుకోవాలి. అన్ని ఇళ్ల వాళ్ళను కచ్చితంగా పిలవాలి. ఒక్కటే శ్మశానం. మంచినీళ్ళ బావి, ప్రార్థనా స్థలాలు ఒక్కటే. కులాల వారీగా కాకుండా అందరి ఇళ్ళు కలిసిపోయి ఉంటాయి. సామాజిక సమానత్వం పథకం కింద పెరియార్ పేరు మీదుగా నిర్మించిన ఈ ఉచిత ఇంట్లో నివసించాలంటే వారు ఈ నియమాలన్నీ కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసిమెలిసి జీవించాలి. నియమాలను ఏమాత్రం ఉల్లంఘించినా వారి ఇళ్ళు రద్దైపోతాయి. అద్భుతమైన ఈ సమతా గ్రామాలు ప్రజల మధ్య సామరస్యం పెంచడంలో ఎంతో దోహదపడ్డాయి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల 238వ సమతాపురం గ్రామాన్ని ప్రారంభించాడు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకుల ఆలోచనలు మనుషుల్ని ఐక్యం చేసేలా ఉంటే, బూర్జువా ప్రయోజనాలు, స్వప్రయోజనాల కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఎప్పుడూ మనుషుల్ని విడగొట్టే ప్రయత్నాలే చేస్తాయి. జనం అజ్ఞానమే వీరి బలం ———————— గీత ఇవతల ఉన్నది మనవాళ్ళు. అవతల ఉన్నది మన శత్రువులు అనే విష బీజాన్ని ప్రజల మనసుల్లో నాటకపోతే రాజకీయ నాయకులకు మనుగడే ఉండదు. బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకైతే ఇది మాత్రమే సరిపోదు. వీళ్ళ అవినీతి బండారాలు ప్రజల దృష్టిలో పడే అవకాశమే లేకుండా మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, దేవుళ్ళు దెయ్యాలు అని ప్రజలు నిత్యం కొట్టుకుంటూ చస్తూనే ఉండాలి. మోసాలతో కుట్రలతో వీళ్ళు మళ్ళీ మళ్ళీ అధికారం చేపడుతూనే ఉండాలంటే పుల్వామా, పెహెల్గాం లాంటి ఘటనలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉండాలి. ప్రజలు అజ్ఞానంలోనే ఉండాలి. యుద్ధం వస్తే లాభం ఎవరికి? ———————– అసలు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కళ్ళు కప్పి అంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ లోకి ప్రవేశించడం సాధ్యమా?!! మోడీ అసలు చరిత్ర తెలిసిన ఎవ్వరైనా అనుమానించాల్సిందే. ఈ అణ్వాయుధాల యుగంలో పాకిస్థాన్ తో యుద్ధమే వస్తే కోలుకోలేని దెబ్బ తగిలేది ఇరు దేశాల సైనికులు, సామాన్య ప్రజలకే తప్ప రెండు దేశాల నాయకుల ఏ నష్టమూ జరగదు పైగా బీజేపీకి బోలెడంత లాభం. ఎన్నికలొస్తున్నాయంటే పాక్ సరిహద్దునో, చైనా సరిహద్దునో కెలికి సైనికుల శవ రాజకీయంతో అమాయక ప్రజలకు దేశభక్తి పూనకాలు తెప్పించి గెలిచే దరిద్రపు చరిత్ర ఉన్న మోడీ బీజేపీ పెహెల్గామ్ దాడిని తమకు అనుకూలంగా అద్భుతంగా మార్చుకోబోతోందనడంలో ఏ సందేహం అక్కరలేదు. దానికి నిదర్శనమే ఈ సంఘటన మీద మోడీ బీహార్ లో మాట్లాడ్డం. దేశం ఎలా అయినా చావనీ.. పాక్ తో యుద్దాన్ని ప్రకటించి దేశభక్తి వేడి తగ్గక ముందే, సైనికుల రక్తంతో జమిలి ఎన్నికలు ప్రకటించినా ఆశ్చర్యం లేదు. కొస మెరుపు ———– బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మొన్న ఒక ట్వీట్ చేశాడు. దేశంలోని 140 కోట్ల ప్రజలంతా దేశ భక్తి భావన కలిగి ఉండనంత వరకూ ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయట!!! ఉగ్రదాడులు అరికట్టడానికీ ప్రజల దేశభక్తికి ఏంటి సంబంధం? దేశంలో కోటి మందికి దేశభక్తి లేకపోయినా పాలకులు ఇలాంటి దాడులు అరికట్టలేరా?!! ఎందుకీ రెచ్చగొట్టే మాటలు!!! . ప్రజలు ఈ దేశ భక్తితో ఏం చేయాలి? పాక్ మీద బాంబులు వేయాలా? లేక భారతీయ ముస్లిమ్స్ నే తరిమికొట్టాలా?!!! దేనికోసం ఇలాంటి విద్వేషపు మాటలు? దేశభక్తి అంటే మోడీని సమర్ధించడం. దేశ ద్రోహం అంటే మోడీని ప్రశ్నించడం. నిజానికి ఇలాంటి దాడులు దేశభక్తి పూనకాలు ఉన్నంతవరకే తప్ప ఈ దేశంలోని మొత్తం 140 కోట్ల మంది ఈ చెత్త దేశభక్తిని వదిలేసి, దేశాన్ని నిజంగా ప్రేమించడం మొదలు పెడితే నిజానిజాలు బట్టబయలై ఇలాంటి దాడులకు ఆస్కారమే లేకుండా పాలకుల కుట్రలకు కాలం చెల్లిపోతుంది. “అన్నదమ్ములవలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్”.

