మహిళాదినోత్సవం ఎందుకు? ఎలా? ఎవరి కోసం వచ్చింది?

నాటి శ్రామిక స్త్రీల ఉద్యమ ఫలితం..
నేడు సంపన్న వనితల ఆర్భాటాలకు కేరాఫ్ అడ్రస్ !
—————————

అంతర్జాతీయ మహిళా దినోత్సవం మళ్ళీ వచ్చేసింది. ఇలా ప్రతి ఏడూ వస్తూనే ఉంటుంది. ప్రతీ సంవత్సరం ఈ రోజు ఆడవారిని ఆకాశానికి ఎత్తేస్తూనే ఉంటారు. పాపం, ఈ ఒక్కరోజూ మహిళ తన జన్మసార్థకమైందనీ, తన స్థానం చాలా ఉన్నతమైనదనీ మురిసిపోయేంతలోనే మర్నాటి నుండి ఆమెను పాతాళానికి అణగదొక్కేందుకు సిద్ధంగా ఉంటుంది ఈ పురుషాధిక్య సమాజం.

వరకట్నపు చావులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు, అన్ని రంగాల్లో మహిళలకు ఎదురయ్యే వివక్ష, అసమానతలు మన సమాజంలో సర్వసాధారణమైన విషయాలుగా మారిపోయాయి.

‘అరే, ఇదేంటి నిన్న మహిళాదినోత్సవం రోజు నన్ను అందలం ఎక్కించిన ఈ సమాజం ఈ రోజు ఇంత చిన్న చూపు చూస్తుందే, ఇదేం అన్యాయం’ అనే ఆలోచన కూడా చాలా మంది మహిళలకు రాదు.

ఎందుకంటే వారి దృష్టిలో మహిళాదినోత్సవం అనేది దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ లాంటి ఒక పండుగ మాత్రమే. ఆనందంగా వేడుక చేసుకున్నామా, శుభాకాంక్షలు చెప్పుకున్నామా, ఎంజాయ్ చేశామా అంతే.

అంతర్జాతీయ మహిళాదినోత్సవం అంటే మహిళల కోసం ప్రత్యేకంగా వేడుక జరుపుకునే రోజు. అయితే మహిళలకే ఎందుకీ ప్రత్యేకత. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం లేదే..! (ఉన్నా దానికి ప్రాధాన్యత లేదు ) మన సమాజంలో ఆడవారు మగవారికంటే అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నందున వారిని సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా ప్రోత్సహించేందుకు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడం హర్షించదగ్గ విషయమే అయినప్పటికీ దీని వల్ల మహిళలకు ఏమైనా ఉపయోగముందా… అనే ప్రశ్న వేసుకుంటే లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. పైగా ఎంతో కొంత నష్టం లేకపోలేదు.

మగవారికి ఉపయోగపడుతోంది
———————————–
ఓ శతాబ్ద కాలానికి పైగా ప్రతీ సంవత్సరం ప్రపంచమంతా ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉంది. అయినా సమానత్వం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించట్లేదు. ఆడవారిపట్ల వివక్ష నానాటికీ పెరిగిపోతూనే ఉంది. ప్రతీ రంగంలో అణిచివేతను ఎదుర్కొంటున్నప్పటికీ, వారు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా దూసుకుపోతున్నారు అని మహిళలను మభ్యపెట్టేందుకు ఈ మహిళా దినోత్సవం మగవారికి బాగా ఉపయోగపడుతోంది.

ఆ ఒక్కరోజు ఆడవారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తే చాలు, వారి అహం ఎంతో కొంత సంతృప్తి చెంది ప్రతి నిత్యం ఇంటా బయటా వారు ఎదుర్కొంటున్న వివక్ష పట్ల తిరగబడాలన్న ఆలోచనలపై ఈ ప్రయత్నం నీళ్ళు చల్లక మానదు. అణిచివేత కొనసాగకా మానదు. ఒకరకంగా చెప్పాలంటే, ప్రతి ఏటా ఎంతో గొప్పగా, గర్వంగా చెప్పుకునే ఈ మహిళా దినోత్సవం అనేది మహిళలు సమాజంలో ఇంకా వెనుకబడే ఉన్నారు అని తెలియజేస్తుంది. మగవారికి లేని ఒక ప్రత్యేకమైన రోజు మహిళలకు మాత్రం ఉందంటే సమాజంలో వారి స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈరకమైన ప్రత్యేకత ఎప్పటికీ సమానత్వాన్ని సాధించలేదు.

పొగుడుతూనే అణిచివేత
—————————-
మహిళలను ఒకవైపు పొగుడుతూనే అణిచివేయడం అనాదిగా వస్తున్నదే, దీనికి మన సినిమాలు కూడా చాలా దోహదం చేస్తున్నాయి. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఎన్నో రూపాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తుందని, ఆడజన్మ అపురూపమని చెప్పే మన సినిమాలు అవే బాధ్యతలు మగవారికి కూడా ఉంటాయని, మగవాడు కూడా తండ్రిగా, అన్నగా, భర్తగా పలు రూపాల్లో ఉంటాడని ఎందుకో గుర్తించలేరు పాపం.

ఆడవారు మగవారికి దీటుగా స్వేచ్ఛా, అభివృద్ధి సాధించారంటూ ఆడదాన్ని ఆటవస్తువుగా మార్చి, ఆడంబరాలకు, అలంకరణలకు పరిమితం చేస్తున్నారు. ఆడవారు ఉన్నది మగవాడి ఆనందం కోసమే అన్నంతగా తన స్థాయిని దిగజార్చి ఆడదాన్ని వ్యాపార సాధనంగా వాడుకుంటోంది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇదీ ఒకరకమైన అణచివేతే అని గుర్తించలేని స్థితిలో ఉంది నేటి సమాజం.

ఆడవారు అన్ని రంగాల్లో మగవారికంటే వెనుకబడి ఉన్నారు కాబట్టి అభివృద్ధి దిశగా వారిని ప్రోత్సహించి, దానికోసం తగినంత తోడ్పాటు అందించే సదుద్ధేశంతో ఈ మహిళాదినోత్సవం ఏర్పాటు జరిగినదైతే దాన్ని కచ్చితంగా అందరూ స్వాగతించాలి. దానికోసం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునే చిత్తశుద్ధి నిజంగా పాలకులకు ఉంటే, సమాజంలో ఈరోజు అన్ని రంగాలలో మహిళలు మగవారితో సమానంగా ఉండేవారు. ఇలా ప్రత్యేకంగా ఒక్కరోజు కీర్తి కిరీటాలు పెట్టుకోవల్సిన దుర్గతి పట్టేది కాదు.

ఉద్యమాలూ, త్యాగాలూ
—————————
మరి ఈ మహిళాదినోత్సవం ఏ ఉద్ధేశంతో ఏర్పాటైంది. దీన్ని మార్చి 8వ తేదీనే ఎందుకు జరుపుకుంటున్నాము. ఒకసారి చరిత్రలోకి వెళితే మహిళాదినోత్సవం వెనుక ఎన్నో అలుపెరుగని పోరాటాలూ, ఉద్యమాలూ, త్యాగాలూ ఉన్నాయి.

అమెరికా సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలో కార్మిక మహిళల ఉద్యమంః-
———————-

అది 1908వ సంవత్సరం ఫిబ్రవరి నెల, న్యూయార్క్ నగరం. అమెరికాలో వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు వేల సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చి పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేశారు. తమ డిమాండ్లు తీర్చేవరకు పనిచేసేది లేదని అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కార్మికులంతా ఏకమై స్ట్రైక్ ప్రారంభించారు. ఆడవారితో ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్నందుకు, మగవారికంటే చాలా చాలా తక్కువ జీతం ఇస్తున్నందుకు, పనిస్థలాల్లో లైంగిక వేధింపులను నిరసిస్తూ వీరు ఈ ఉద్యమం చేపట్టారు. ఈ ఉద్యమ సమయంలో పేద కార్మిక స్త్రీలు ఎన్నో ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నప్పటికీ, ఉద్యమాన్ని నీరుగార్చేందుకు పెట్టుబడిదారులు పన్నిన అనేక పన్నాగాలను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రాణాలకు తెగించి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్ళారు. సంవత్సరానికి పైగా ఉదృతంగా కొనసాగిన ఈ మహిళా ఉద్యమానికి యాజమాన్యం దిగిరాక తప్పలేదు.

అమెరికా సోషలిస్ట్ పార్టీ నేతృత్వంలో 1909 ఫిబ్రవరి 28న తొలిసారిగా అమెరికా జాతీయ మహిళాదినోత్సవాన్ని జరుపుకుంది.

ఓటు హక్కుకోసం జర్మనీలో వీరోచితంగా పోరాడిన మహిళలుః-
—————–

జర్మనీలో మహిళలు తాము కూడా మగవారితో సమానమేనని, తమకు ఓటు హక్కు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం లేవనెత్తారు. సుదీర్ఘకాలం.. అంటే సుమారు 8 సంవత్సరాల పాటు మహిళలు వీరోచితంగా పోరాడి మరీ ఓటు హక్కు సాధించుకున్నారు. ఇలాంటి మహోన్నత ఘట్టం చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు జర్మనీకి చెందిన క్లారా జెట్కిన్ అనే సోషలిస్టు నాయకురాలు .

పని స్థలాల్లో మహిళల హక్కులు కాపాడడం కోసం ప్రతీ సంవత్సరం ఒక రోజుని అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా జరుపుకోవాలని 1910లో జరిగిన ఇంటర్నేషనల్ వర్కింగ్ విమెన్ కాన్ఫెరెన్స్ లో తొలిసారిగా ఆమె ప్రతిపాదించారు . ఈ ప్రతిపాదను యూరప్ దేశాలన్నీ సమర్థించాయి. కానీ ఫలానా రోజు అనే ప్రకటన చేయలేదు.

ఊపందుకున్న రష్యన్ ఉద్యమంః-
———————-

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలో రోడ్లపైకి వచ్చిన సుమారు 40 వేల మంది మహిళలు తమ నిరసన గళంతో మాస్కో నగరాన్ని కుదిపేశారు. ప్రాణాలకు తెగించి పోరాడి రాచరికాన్ని కూకటివేళ్ళతో పెకిలించగలిగారు. యుద్ధంలో వేల సంఖ్యలో సైనికులు మరణించడం, దేశంలో ఏర్పడిన ఆహారపు కొరత, ఆకలి చావులను వ్యతిరేకిస్తూ..మహిళలంతా ఏకమైయ్యారు. యుద్ధం ముగించాలని, బ్రెడ్ అండ్ పీస్… ఆహారం , శాంతి కావాలంటూ, రాచరికం అంతరించిపోవాలంటూ, స్త్రీలకు కూడా ఓటు హక్కు కల్పించాలంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఉద్యమ ధాటికి తట్టుకోలేని జార్ నికొలస్ చేసేది లేక అధికారాన్ని వదులుకున్నాడు. దాంతో రష్యాలో జార్ అరాచక రాచరికం అంతరించిపోయింది. వెంటనే ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం స్త్రీలకు ఓటు హక్కు కల్పించింది. ఈ ఉద్యమం ప్రారంభమైన రోజు జార్ ప్రభుత్వం అనుసరించే పాత రష్యన్ క్యాలెండర్ ప్రకారం 23 ఫిబ్రవరి, అంటే ఇప్పటి మార్చ్ 8. 1917లో అక్టోబర్ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన లెనిన్, సోవియట్ యూనియన్లో ఈ రోజుని అధికారిక సెలవు దినంగా ప్రకటించాడు. ప్రపంచ మహిళల్లో విప్లవ జ్వాల రగిలించేలా రష్యా మహిళల విప్లవ స్పూర్తి, దేశ భక్తి, శాంతి కోసం పడిన ఆరాటం, సాటి మనుషుల పట్ల చూపించే ప్రేమ, స్నేహం ప్రపంచ దేశాలను ఆకట్టుకుంది. మార్చి 8న మహిళల హక్కుల కోసం పోరాడే దినంగా మహిళాదినోత్సవాన్ని జరుపుకోవాలని భావించాయి.

చైనాలో కూడా మహిళల హక్కుల కోసం 1922 నుంచి 1927 వరకు పెద్ద పోరాటాలే జరిగాయి. 25 వేలకు పైగా మహిళల ఉద్యమంలో పాల్గొన్నారు. 1949లో చైనా స్టేట్ కౌన్సిల్ మార్చి 8న మహిళాదినోత్సవంగా, ఆరోజు అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. మొదట్లో ఈ వేడుకలు కేవలం కమ్యూనిస్టు దేశాల్లో మాత్రమే జరుపుకునేవారు. క్రమంగా కజకిస్తాన్ నుంచి కంబోడియా వరకు అనేక దేశాల్లో మహిళలు రోడ్లు ఎక్కి తమ హక్కుల కోసం ఉద్యమాలు చేపట్టే క్రమంలో మహిళా దినోత్సవాన్ని ప్రకటించుకున్నారు.

మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్యసమితి 1975లో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అదే సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా పేర్కొంది. ప్రతీ సంవత్సరం మహిళల హక్కులకు సంబంధించిన ప్రత్యేక అంశంతో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. 2022 ఇంటర్నేషనల్ విమెన్స్ డే ని బ్రేక్ ది బయాస్ థీమ్ తో ముందుకు వచ్చింది.

ఇప్పుడు తమ వ్యాపార సాధనంగా…
—————————————-
ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకైతే నిరసనగా అట్టడుగు కార్మిక మహిళలు ఉద్యమాలు, పోరాటాలు చేశారో, అదే పెట్టుబడిదారీ వ్యవస్థ ఆ పోరాటాలకు గుర్తుగా ఉన్న ఈ మహిళాదినోత్సవాన్ని ఇప్పుడు తమ వ్యాపార సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. మధర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వాలెంటెన్స్ డే అంటూ రకరకాల దినాలుపెట్టి ప్రజల అజ్ఞానం, బలహీనతలే తమ లాభాలు అన్న రీతిలో వ్యాపారాలు సాగిస్తూ చివరికి మహిళాకార్మికోద్యమమైన మహిళాదినోత్సవాన్ని కూడా రకరకాల గిఫ్టులూ, గ్రీటింగులూ అమ్ముకుంటూ… ఈ సందర్భంగా అందాల పోటీలు నిర్వహిస్తూ దాని కోసం కాస్మటిక్స్ అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్నాయి.

శ్రామిక స్త్రీల ఉద్యమ ఫలితంగా ఉన్న ఈ మహిళాదినోత్సవం ఇప్పుడు సంపన్న స్త్రీల ఆర్భాటాలకు, అలంకారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. సమానత్వం అంటే అర్థం కూడా తెలియని ఎంతో మంది మహిళలు ఈ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.

అసలు ఆడవారి హక్కులేంటి? వారు ఆత్మగౌరవంతో తలెత్తుకుని ఎలా బతకాలి? అన్యాయాన్ని ఎలా ప్రతిఘటించాలి? స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఎలా పొందాలి? మగవారితో సమానమైన జీవితాన్ని ఎలా సాధించాలి? ఇలాంటి ప్రశ్నలేవీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న మహిళాలోకానికి ఏమీ పట్టవు.

అత్యధికంగా స్త్రీలు ఎంత చదువుకున్నవారైనా సరే, తమ స్థాయి మగవారికంటే తక్కువ అనే అభిప్రాయంతోనే ఉన్నారు.

షోకులూ, షాపింగులే లోకంగా..
——————————
మగవాడు ఆడదాన్ని తన ఆనందం కోసమే ఉన్న విలాస వస్తువుగా చూస్తే… అధిక శాతం ఆడవాళ్ళు కూడా తాము మగవాళ్ళను ఆకర్షించి, ఆకట్టుకోడానికి మాత్రమే ఉన్నట్టు అలంకరణలు, షోకులు, మేకప్ లు, బ్యూటీపార్లర్లు, నగలు, చీరలు, షాపింగ్ లు, ఆర్భాటాలు- ఇవే లోకంగా బతుకుతున్నారు.

సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలేవీ వీరికి పట్టవు. కులం, మతం అని గిరిగీసుకుని, పూజలు, వ్రతాలు, టీవీ సీరియల్స్ అని వాటికే తమని తాము పరిమితం చేసుకుంటూ నిజమైన జ్ఞానానికి అందనంత దూరంగా పారిపోయే స్త్రీజాతికి సమానత్వాన్ని కోరుకోవాలనే ఆలోచనకానీ, హక్కుగానీ ఉంటుందా?

విశాల దృక్పధంతో అన్ని రంగాల్లో తన జ్ఞాన పరిధిని విస్తరింపచేసుకుంటూ, ప్రస్తుతం ఉన్న ఆలోచనా ధోరణి మార్చుకోకపోతే ఇలాంటి మోసపూరితమైన పొగడ్తలతో మురిసిపోవాలే తప్ప భారతదేశ మహిళ సమానత్వం ఎప్పటికీ సాధించలేదు.

Author Vanaja Che

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *